అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Anaganaga Oka Raju Movie Review | యువ హీరో నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ అనగనగా ఒక రోజు సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో ప్రేక్షకులను పలకరించింది. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’, ‘జాతిరత్నాలు’, ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ వంటి హిట్స్ తర్వాత హీరో నవీన్ పొలిశెట్టి నుంచి వస్తున్న సినిమా కావడంతో, రిలీజ్ ముందే పాజిటివ్ బజ్ ఏర్పడగా, ఈ రోజు రిలీజ్ అయిన చిత్రం ఎలా ఉందో చూద్దాం.
కథ:
గౌరవపురం జమీందారు గోపరాజు మనవడు రాజు (నవీన్ పొలిశెట్టి). ఊరిలో అతడికి పేరు ప్రతిష్టలు పెద్దవే అయినా, చేతిలో మాత్రం చెప్పుకోదగ్గ ఆస్తులేమీ ఉండవు. కారణం – అతడి తాత గోపరాజు పేరు జమీందారైనప్పటికీ, స్వభావంలో మాత్రం అసలైన రసికరాజు. తన కాలంలో ఉన్న ఆస్తులన్నింటినీ విచ్చలవిడిగా ఖర్చుచేసి దోబూచులాడేశాడు. ఇక తాత నుంచి ఆస్తులు దక్కే అవకాశమే లేదని తెలుసుకున్న రాజు, కనీసం “జమీందారు మనవడు” అనే ట్యాగ్‌నైనా ఉపయోగించుకుని పెళ్లి ద్వారా కోటీశ్వరుడు కావాలని ప్లాన్ వేస్తాడు. ఆ క్రమంలో పెద్దిపాలెం గ్రామానికి చెందిన సంపన్నుడైన భూపతి రాజు (రావు రమేష్) ఒక్కగానొక్క కూతురు చారుపై (మీనాక్షి చౌదరి) రాజు కన్నేస్తాడు. కోట్లకు కోట్లు ఆస్తులున్న ఆ కుటుంబంలోకి ఎలాగైనా అల్లుడిగా ఎంట్రీ ఇవ్వాలన్న ఉద్దేశంతో ‘ఆపరేషన్ చారు’ అనే పెద్ద స్కెచ్‌ను అమలు చేస్తాడు.
అన్నీ అనుకున్నట్లుగానే జరిగి, భూపతి రాజు కూడా తన కూతురు చారు–రాజు పెళ్లిని అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు గుర్తుండిపోయేలా ఘనంగా జరిపిస్తాడు. రాజు కలలు నిజమయ్యాయని అనుకునేలోపే కథ అసలు మలుపు తిరుగుతుంది. ఫస్ట్ నైట్ రోజే రాజు చేతికి చారు మావయ్య భూపతి రాసిన ఒక లేఖ అందుతుంది. ఆ లేఖ చదివిన వెంటనే రాజుకు భూమి కనిపించదు. పెళ్లితో కోటీశ్వరుడు అయిపోదామనుకున్న తన ఆశలన్నీ ఒక్కసారిగా తలకిందులవుతాయి. ఆ లేఖలో ఏముంది? రాజుకి తగిలిన షాక్ ఏంటి? ఇంతలో పెద్దిపాలెం ప్రెసిడెంట్ ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎర్రిబాబుకి (తారక్ పొన్నప్ప) ఎదురుగా రాజు ఎందుకు నామినేషన్ వేయాల్సి వచ్చింది? అనుకోకుండా రాజకీయాల్లోకి దిగిన రాజు, చివరకు ప్రెసిడెంట్ ఎన్నికల్లో గెలిచాడా? లేదా? అన్నదే మిగతా కథ.
నటీనటుల పర్ఫార్మెన్స్:
సినిమా మొత్తం ఎక్కడా నవ్వులకు బ్రేక్ పడకుండా నవీన్ పొలిశెట్టి ప్రేక్షకులను చక్కగా ఎంటర్‌టైన్ చేశాడు. ముఖ్యంగా అతడు వేసిన వన్‌లైనర్లు, పంచులు చాలా చోట్ల గట్టిగానే పేలాయి. స్క్రీన్‌పై ఎప్పటిలాగే ఎనర్జీతో, టైమింగ్‌తో నవీన్ చేసిన నటన ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుంది. నిజానికి ఇది పూర్తిగా నవీన్ ఒన్‌మ్యాన్ షో అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. హీరోయిన్ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) గత ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో భారీ హిట్ అందుకుంది. ఈ ఏడాది కూడా పండగకు పలకరిస్తూ చారు పాత్రలో కనిపించింది. పాత్రకు తగ్గట్టుగా ఆమె నటన ఓకే అనిపిస్తుంది, గ్లామర్‌తో పాటు పర్ఫార్మెన్స్‌లోనూ బాగానే నిలిచింది.
కనిపించింది కాసేపే అయినా రావు రమేష్ (Rao Ramesh) తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారు. ఆయన పాత్రకు ఉన్న బరువుతో అక్కడక్కడా మంచి ఎంటర్‌టైన్‌మెంట్ పండించారు. మహేష్ ఆచంట, ముక్కు అవినాష్, ఝాన్సీ తదితర పాత్రలు అవసరమైన చోట నవ్వులు పూయించాయి. విలన్ పాత్రలో తారక్ పొన్నప్ప తనకు ఇచ్చిన స్కోప్ మేరకు బాగానే నటించాడు. అయితే మొత్తం ఎంటర్‌టైన్‌మెంట్ బాధ్యతను నవీన్ ఒంటిచేత్తో మోసినట్టుగా అనిపిస్తుంది.
టెక్నికల్ పర్‌ఫార్మెన్స్:
టెక్నికల్‌గా చూసుకుంటే.. పాటలు పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాయి. ఎడిటింగ్‌కు ఇంకాస్త పనిచెప్పుంటే బాగుండేది అనిపించింది. సినిమాటోగ్రఫి బాగుంది. పల్లెటూరును ముఖ్యంగా గోవా సెటప్‌ను బాగా చూపించారు. మిక్కీ జే మేయర్ అందించిన పాటల్లో “భీమవరం బాల్మా” ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సన్నివేశాలకు తగ్గట్టుగా ఫర్వాలేదనిపిస్తుంది. ఓవరాల్‌గా చూస్తే, ఈ సంక్రాంతికి నవీన్ పొలిశెట్టి ప్రేక్షకులకు నవ్వులు పంచడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.
నటులు :నవీన్ పొలిశెట్టి,మీనాక్షి చౌదరి,రావు రమేష్, తారక్ పొన్నప్ప
సినిమా శైలి : తెలుగు, కామెడీ
దర్శకుడు : మారి
ప్లస్ పాయింట్స్:
నవీన్ పర్‌ఫర్మెన్స్
కమెడీయన్స్
మిక్కీ జే మేయర్
మైనస్ పాయింట్స్
పాటలు
ఎడిటింగ్
విశ్లేషణ
విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగిన ఈ సినిమా ప్రేక్షకులకు పక్కా నవ్వుల రైడ్‌ను అందిస్తుంది. “తాను రిచ్చే రిచ్చు” అంటూ నవీన్ పొలిశెట్టి ఇచ్చే ఓవర్ బిల్డప్‌లు, కవరింగ్‌లతో మొదలైన నవ్వులు, హీరోయిన్‌ను పడేయాలనే ఉద్దేశంతో మొదలుపెట్టిన ‘ఆపరేషన్ చారు’తో మరింత రెట్టింపు అవుతాయి. ముఖ్యంగా పెద్దిపాలెం బీచ్‌ను గోవాగా మార్చి చూపించిన సీన్, హీరోయిన్‌తో కలిసి చేసిన పారా గ్లైడింగ్ ఎపిసోడ్ థియేటర్‌లో గట్టిగా నవ్వులు పూయిస్తుంది. ఆ సన్నివేశాల్లో నవీన్ కామెడీ టైమింగ్ అదిరిపోయింది. పెళ్లి తర్వాత హీరోకు ఒక నిజం తెలిసి షాక్ తగలడంతో, ప్రేక్షకులకు మాత్రం ఊహించని మలుపు ఇస్తూ ఇంటర్వెల్‌ను మంచి బ్యాంగ్‌తో ముగించారు.
సెకండాఫ్ మొత్తం పెద్దిపాలెం ప్రెసిడెంట్ ఎన్నికల నేపథ్యంలో సాగుతుంది. ప్రజా సమస్యలు, రాజకీయ హామీల పేరుతో నవీన్ చేసే కామెడీ హంగామా ఎక్కడా బ్రేక్ లేకుండా ప్రేక్షకులను నవ్విస్తూనే ఉంటుంది. సినిమా మొదలైనప్పటి నుంచి చివరి వరకూ కామెడీ డోస్ తగ్గకుండా జాగ్రత్తగా హ్యాండిల్ చేశారు. ప్రీ క్లైమాక్స్‌లో ఇచ్చిన ఎమోషనల్ టర్న్ సినిమాకు మరో ప్లస్‌గా నిలుస్తుంది. అప్పటివరకూ సరదాగా సాగిన కథను ఒక్కసారిగా భావోద్వేగంగా మలిచి, సీరియస్ నోట్‌కు తీసుకెళ్తారు. అయినా చివర్లో మాత్రం మళ్లీ నవ్వులతోనే కథకు శుభం కార్డు వేసి ప్రేక్షకులను హ్యాపీగా థియేటర్ నుంచి బయటకు పంపిస్తారు.