అక్షరటుడే, వెబ్డెస్క్ : Bus Accident | మహబూబ్‌నగర్ జిల్లా (Mahbubnagar District) జడ్చర్ల మండలం మాచారం వద్ద మంగళవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, ముందు వెళ్తున్న డీసీఎంను ఢీకొంది.
సంక్రాంతి నేపథ్యంలో హైదరాబాద్ (Hyderabad) నుంచి ప్రజలు స్వగ్రామాలకు వెళ్తున్నారు. ఇలా ప్రయాణికులతో కర్నూల్ వెళ్తున్న బస్సు భారీ ప్రమాదానికి గురైంది. 44వ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, ముందున్న డీసీఎంను ఢీకొంది. ఈ ఘటనలో 31 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సంక్రాంతి పండుగ (Sankranti Festival)కు ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Bus Accident | సడెన్ బ్రేక్ వేయడంతో..
కొల్లాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (RTC Bus) హైదరాబాద్ నుంచి కర్నూలుకు ప్రయాణికులతో బయలుదేరింది. సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు వెళ్తున్నామని ప్రయాణికులు ఆనందంలో ఉన్నారు. అర్ధరాత్రి వేళ ప్రయాణికులు నిద్రలో ఉన్న సమయంలో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. డీసీఎం డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. డీసీఎం అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొంది. ప్రమాదంలో బస్సు ముందు భాగం ధ్వంసమైంది. జిల్లా అడిషనల్ ఎస్పీ ఎన్.బి. రత్నం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాద సమయంలో బస్సులో 53 మంది ప్రయాణికులు ఉన్నారని ఆయన తెలిపారు. కాగా ఇటీవల బస్సు ప్రమాదాలు పెరగడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా రాత్రి, తెల్లవారుజామున ఎక్కువ శాతం బస్సులు ప్రమాదాలకు గురి అవుతున్నాయి.
