అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Yadadri Bhuvanagiri | ఈ రోజుల్లో వివాహం అంటే హంగు ఆర్భాటాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మధ్య తరగతి కుటుంబాలు సైతం తమ స్థాయిని మించి పెళ్లి కోసం ఖర్చు చేస్తున్నాయి. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు వైభవంగా వివాహ వేడుకలు జరిపించుకుంటున్నారు. అయితే ఇద్దరు సివిల్ సర్వీసెస్ (Civil Services) అధికారులు ఎలాంటి ఆడంబరాలకు పోకుండా వివాహం చేసుకోవడంపై నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి.
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఈ ఆదర్శ వివాహం చేసుకున్నారు. ఎలాంటి ఆడంబరం లేకుండా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం (Sub-Registrar Office)లో పెళ్లి చేసుకున్నారు.
Yadadri Bhuvanagiri | చౌటుప్పల్‌లో..
చౌటుప్పల్ మండలం లింగారెడ్డిగూడెంకు చెందిన యువ ఐపీఎస్ అధికారిని (IPS Officer) శేషాద్రిని రెడ్డిని, కడప జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారి (IAS officer) శ్రీకాంత్ రెడ్డి వివాహం చేసుకున్నారు. చౌటుప్పల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎలాంటి ఆడంబరం లేకుండా వీరి రిజిస్టర్ వివాహం జరిగింది. శేషాద్రిని రెడ్డి ప్రస్తుతం కుత్బుల్లాపూర్ డీసీపీగా (Quthbullapur DCP) ఉండగా.. శ్రీకాంత్ రెడ్డి ట్రెయినీ ఐఏఎస్‌గా కొనసాగుతున్నారు. ఈ వివాహానికి పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. వారి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో (Social Media) వైరల్‌గా మారాయి. ఈ జంటను నెటిజన్లు అభినందిస్తున్నారు. సివిల్ సర్వీసెస్ అధికారులు అయి ఉండి ప్రజలకు ఆదర్శంగా ఉండేలా రిజిస్టర్ మ్యారేజీ చేసుకోవడంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.