అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Land Auction | ఎకరం భూమి ఏకంగా రూ.70 కోట్లు పలికింది. హైదరాబాద్(Hyderabad) నగరంలో కొంతకాలంగా రియల్ ఎస్టేట్ రంగం పడిపోతుందని ప్రచారం జరుగుతోంది. క్రయవిక్రయాలు లేక రియల్ ఎస్టేట్ వ్యాపారులు నష్టపోతున్నారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ క్రమంలో నగరంలోని కేపీహెచ్‌బీ(KPHB)లో ఎకరానికి ఏకంగా రూ.70 కోట్ల చొప్పున వేలం పాడి ఒక కంపెనీ దక్కించుకుకుంది.
కూకట్పల్లి(Kukatpally)లో హౌసింగ్‌బోర్డుకు చెందిన 7.8 ఎకరాల భూమిని అధికారులు వేలం వేశారు. ఈ భూమి వేలం కోసం గతంలోనే నోటిఫికేషన్ జారీ చేయగా నాలుగు కంపెనీలు టెండర్ వేశాయి. ఆయా కంపెనీలు బుధవారం నిర్వహించిన వేలంలో పాల్గొన్నాయి. మొదట ఎకరాకు రూ.40 కోట్లు ప్రాథమిక ధరగా నిర్ణయించగా కంపెనీలు భూమిని దక్కించుకోవడానికి తీవ్రంగా పోటీ పడ్డాయి. ఈ క్రమంలో 7.8 ఎకరాల భూమిని రూ.547 కోట్లకు గోద్రెజ్ ప్రాపర్టీస్ దక్కించుకుంది. వేలంలో అరబిందో రియాల్టీ, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, అశోక బిల్డర్స్ పాల్గొన్నాయి.
Land Auction | పేదల కోసం..
కేపీహెచ్‌బీలోని భూమి దక్కించుకోవడానికి కంపెనీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. బిడ్డర్లు 46 సార్లు ధరను పెంచడం గమనార్హం. చివరకు ఎల్–1లో గోద్రెజ్ కంపెనీ ఈ భూమిని సొంతం చేసుకుంది. మూడున్నర గంటల పాటు ఈ వేలం పాట నిర్వహించారు. గోద్రేజ్ సంస్థ ఎకరానికి రూ.70 కోట్లు చెల్లించడానికి వేలం పాడినట్లు హౌసింగ్ బోర్డు ఎండీ వీపీ గౌతమ్(Housing Board MD VP Gautam) తెలిపారు. ఈ భూముల వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని పేద, మధ్య తరగతి వర్గాలకు ప్రయోజనం కల్గించే గృహ నిర్మాణ పథకాలకు వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
Land Auction | రాజీవ్ స్వగృహ టౌన్‌షిప్‌లలో..
నగరంలోని పలు ప్రాంతాల్లోని రాజీవ్‌స్వగృహ కార్పొరేషన్(Rajiv Swagruha Corporation)కు చెందిన టౌన్‌షిప్‌లలో అసంపూర్తిగా ఉన్ టవర్లను సైతం అధికారులు బుధవారం విక్రయించారు. మొత్తం మూడు టవర్లు విక్రయించగా ప్రభుత్వానికి రూ.రూ.70.11 కోట్ల ఆదాయం వచ్చింది. హైదరాబాద్ శివారులోని పోచారం టౌన్ షిప్లో ఉన్న 112 ఫ్లాట్లను గాయత్రీ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ ట్రస్టుకు రూ.30 కోట్లకు లాటరీ ద్వారా ప్రభుత్వం కేటాయించింది. ఇదే టౌన్‌షిప్‌లోని 72 ఫ్లాట్లతో ఉన్న ఉన్న మరో టవర్‌ను కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్టీపీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రూ.13.78 కోట్లకు కొనుగోలు చేసింది.
గాజులరామారంలో 112 ఫ్లాట్లతో టవర్‌ను ఎఫ్‌సీఐ ఎంప్లాయీస్ అసోసియేషన్ రూ.26.33 కోట్లకు కొనుగోలు చేసింది.