అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Land Rates | హైదరాబాద్ నగరంలో (Hyderabad city) భూములకు ఉన్న డిమాండ్ తెలిసిందే. ఎకరం భూమి రూ.వంద కోట్లకు పైగా పలుకుతోంది. తాజాగా కోకాపేటలో (Kokapeta) భూమి రికార్డు ధర పలికింది.
కోకాపేటలోని నియోపొలిస్‌లో ప్లాట్ నంబర్ 17, 18లోని భూములకు సోమవారం ప్రభుత్వం వేలం వేసింది. ప్లాట్ నం.17లోని భూమి ఎకరం ఏకంగా రూ.137.25 కోట్లు పలికింది. హెచ్ఎండీఏ పరిధిలోని (HMDA area) ఖరీదైన భూములను ప్రభుత్వం వేలం వేస్తున్న విషయం తెలిసిందే. కోకాపేట భూముల (Kokapeta lands) వేలం కోసం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది.
తాజాగా ఆన్లైన్లో వేలం ప్రక్రియ నిర్వహించారు. కనీస ధర రూ.99 కోట్లుగా నిర్ణయించగా.. రూ.137.25 కోట్లు పలకడం గమనార్హం. మొత్తం 41 ఎకరాల విస్తీర్ణంలోని ఆరు ప్లాట్లను హెచ్ఎండీఏ అధికారులు వేలం వేస్తున్నారు. ప్లాట్ నెంబర్17లో 4.59 ఎకరాలు, 18లో 5.31 ఎకరాల భూమి ఉంది. మొత్తం 9.9 ఎకరాలకు 1,355.33 కోట్లు ధర పలికింది. 2023 ఎకరాకు సగటను రూ.73 కోట్లు ఉండగా.. ఇప్పుడు 87శాతం పెరుగుదల నమోదైంది.
మిగతా భూములకు ఈ నెల 28న, డిసెంబర్ 3న వేలం ప్రక్రియ నిర్వహించనున్నారు. గోల్డెన్ మైల్‌లోని సైట్-2లో 1.98 ఎకరాలు, మూసాపేట్‌లో 3.18, 11.48 ఎకరాల్లోని రెండు సైట్లకు అధికారులు వేలం నిర్వహించనున్నారు. దీంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరనుంది.
Land Rates | గతంలో రూ.177 కోట్లు
నగరంలోని రాయదుర్గం నాలెడ్జ్ సిటీ (Rayadurgam Knowledge City) భూములకు అక్టోబర్ వేలం నిర్వహించారు. దీనికి రికార్డు స్థాయిలో స్పందన వచ్చింది. అత్యధికంగా ఎకరం భూమి రూ.177 కోట్లు పలికింది. అత్యధిక ధరకు 7.6 ఎకరాల భూమిని MSN రియాల్టీ కంపెనీ రూ.1357.59 కోట్లకు దక్కించుకుంది. వేలం ప్రారంభ ధర ఎకరాకు రూ.101 కోట్లు ఉండగా MSN రియాల్టీ ఏకంగా రూ.177 కోట్లకు కొనుగోలు చేసింది.
