అక్షరటుడే, వెబ్‌డెస్క్ : T20 World Cup | ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 విషయంలో అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ వేదికగా జరగనున్న ఈ మెగా టోర్నీలో బంగ్లాదేశ్ పాల్గొనాలా? లేక దూరంగా ఉండాలా? అనే అంశంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఇంకా స్పష్టమైన నిర్ణయానికి రాలేదు. ఈ నేపథ్యంలో ఐసీసీ, బీసీబీకి తుది నిర్ణయం తీసుకోవడానికి ఒక్కరోజు గడువు విధించింది.
అయినప్పటికీ ఐసీసీ తన నిర్ణయాన్ని పునర్విమర్శిస్తుందన్న ఆశను బీసీబీ (Bangladesh Cricket Board) ఇంకా విడిచిపెట్టలేదు.ఈ అంశంపై బుధవారం జరిగిన ఐసీసీ బోర్డు సమావేశం కీలకంగా మారింది. అన్ని ఫుల్ మెంబర్ దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో ఓటింగ్ నిర్వహించగా, టోర్నీ షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు అవసరం లేదని ఐసీసీ తేల్చిచెప్పింది. 20 జట్లతో జరిగే టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ జట్టు భారత్‌కే వచ్చి మ్యాచ్‌లు ఆడాల్సిందేనని స్పష్టం చేసింది. భద్రతాపరంగా ఎలాంటి ముప్పు లేదని స్వతంత్ర నివేదికలు పేర్కొన్న నేపథ్యంలో మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చే ప్రతిపాదనను ఐసీసీ పూర్తిగా తిరస్కరించింది.
T20 World Cup | కొనసాగుతున్న సస్పెన్స్..
ఐసీసీ ప్రకటన అనంతరం బీసీబీ అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం (BCB President Aminul Islam) స్పందిస్తూ, తాము ఇంకా ఆశలు వదలలేదని అన్నారు. జై షా నేతృత్వంలోని ఐసీసీ నుంచి చివరి నిమిషంలోనైనా సానుకూల పరిణామం చోటుచేసుకుంటుందన్న నమ్మకం తమకు ఉందని తెలిపారు. ఓటింగ్‌కు ముందు తమ అభ్యంతరాలకు గల కారణాలను ఐసీసీ బోర్డుకు వివరించామని, అయినప్పటికీ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనకుండా పక్కకు తప్పుకున్నామని ఆయన వెల్లడించారు. బంగ్లాదేశ్ ఆటగాళ్లు వరల్డ్ కప్‌లో ఆడాలనే ఉత్సాహంతో ఉన్నారని, ప్రభుత్వమూ అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందని అమినుల్ పేర్కొన్నారు. అయితే భారత్ లో తమ జట్టు పూర్తిగా సురక్షితంగా ఉంటుందా అనే నమ్మకం లేకపోవడమే బీసీబీ ప్రధాన ఆందోళనగా ఉందని చెప్పారు.
ఇదే సమయంలో గ్రూప్ మార్పిడి అంశంపై కూడా ఆయన వివరాలు వెల్లడించారు. బంగ్లాదేశ్ (Bangladesh)ను ఐర్లాండ్ లేదా జింబాబ్వేతో మార్చి శ్రీలంక గ్రూప్‌లో చేర్చడం సులభమైన పరిష్కారమని సూచించినప్పటికీ, శ్రీలంక క్రికెట్ బోర్డు (Sri Lanka Cricket Board) తమ గ్రూప్‌లో కొత్త జట్టును చేర్చేందుకు నిరాకరించడంతో ఆ ప్రతిపాదన ముందుకు సాగలేదని తెలిపారు. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ గ్రూప్ సీలో ఉంది. ఇంగ్లండ్, వెస్టిండీస్, నేపాల్, ఇటలీ జట్లతో కలిసి ఫిబ్రవరి 7, 9, 14 తేదీల్లో కోల్‌కతాలో, ఫిబ్రవరి 17న ముంబైలో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఐసీసీ ఇచ్చిన గడువులోపు తమ ప్రభుత్వంతో మరోసారి చర్చించి తుది నిర్ణయాన్ని ఐసీసీకి తెలియజేస్తామని అమినుల్ స్పష్టం చేశారు. భద్రత విషయంలో తమ వైఖరి మారదని, భారత్‌కి రావడం సురక్షితం కాదన్న అభిప్రాయంపైనే బీసీబీ నిలబడుతోందని చెప్పారు. ఐసీసీ నిర్ణయానికి ఇచ్చిన గడువు ముగిసిన తర్వాతే టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ భవితవ్యం తేలే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.