అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Phone Tapping | రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయ దుమారం రేపుతోంది. ఈ కేసులో సిట్ దూకుడు పెంచడంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
సిట్ అధికారులు (SIT Officers) ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ వేగవంతం చేశారు. ఇటీవల మాజీ మంత్రి హరీశ్‌రావును విచారించారు. తాజాగా కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్నారు. సిట్ విచారణపై బీఆర్ఎస్ నేతలు (BRS Leaders) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆ పార్టీ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని అన్ని ప్రభుత్వాలు ట్యాపింగ్ చేస్తాయన్నారు. ఫోన్ ట్యాప్ చేయడం నేరం కాదని.. దేశ రక్షణ కోసం ట్యాపింగ్ చేయవచ్చని ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ చెప్పిన వీడియోని ఆయన చూపించారు.
Phone Tapping | చర్చ జరగడం లేదు
ఫోన్ ట్యాపింగ్ తప్పు కాదని రేవంత్ రెడ్డి (Revanth Reddy) గతంలో చెప్పారని ప్రవీణ్‌కుమార్ అన్నారు. ఈ రోజు ఆయన ట్యాపింగ్ మీద కేసులు వేస్తున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ దేశ రక్షణ కోసం పోలీసులు చేస్తారని, అన్ని ప్రభుత్వాలు చేస్తాయి చెప్పారు. కానీ ఏ రాష్ట్రంలో కూడా దీనిపై చర్చ జరగడం లేదన్నారు.
Phone Tapping | సజ్జనార్‌కు అర్హత లేదు
నోటుకు ఓటు కేసులో సజ్జనార్ ఫోన్ ట్యాపింగ్ చేశాడని కేసులు పెట్టారని ఆయన గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయినప్పుడు SIగా సజ్జనార్ (Sajjanar) ఉన్నాడు, ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) ఉన్నారని చెప్పారు. ఆనాడు సజ్జనార్, ఇంకా కొంత మంది అధికారులు తమ ఫోన్లు ట్యాప్ చేశారని ఏపీలో కేసులు ఉన్నాయని తెలిపారు. ఇప్పుడు అదే సజ్జానార్ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ బృందానికి నేతృత్వం వహిస్తున్నారని చెప్పారు. రాజకీయ నాయకులను వేధించడానికి ఏర్పాటు చేసిన సిట్‌కు సజ్జనార్ చీఫ్‌గా ఉన్నారని విమర్శించారు. ఆయనకు సిట్‌ను లీడ్ చేసి, ట్యాపింగ్ వ్యవహారాన్ని విచారించే నైతిక అర్హత లేదన్నారు. సజ్జనార్‌పై ఏడు కేసులు ఉన్నాయని, వాటిపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు.