అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Akshay Kumar | బాలీవుడ్ ‘ఖిలాడీ’ అక్షయ్ కుమార్, ఆయన భార్య ట్వింకిల్ ఖన్నా సోమవారం సాయంత్రం తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ముంబై విమానాశ్రయం (Mumbai Airport) నుంచి తమ జుహు నివాసానికి వెళ్తున్న సమయంలో వీరి కాన్వాయ్ ప్రమాదానికి గురైంది.
జుహులోని సిల్వర్ బీచ్ కేఫ్ (Silver Beach Cafe) సమీపంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం గందరగోళంగా మారింది. ఈ ప్రమాదం ఎలా జరిగిందంటే, అతివేగంగా వచ్చిన ఒక మెర్సిడెస్ కారు ముందుగా రోడ్డుపై వెళ్తున్న ఆటో రిక్షాను బలంగా ఢీకొట్టింది. ఆ వేగానికి ఆటో అదుపు తప్పి పక్కనే ఉన్న అక్షయ్ కుమార్ సెక్యూరిటీ వాహనంపైకి దూసుకెళ్లింది. దాంతో సెక్యూరిటీ వాహనం అక్షయ్, ట్వింకిల్ ప్రయాణిస్తున్న ఎస్‌యూవీని ఢీకొట్టింది.
Akshay Kumar | పెద్ద ప్రమాదం తప్పింది..
ఒకదాని వెనుక ఒకటి వాహనాలు ఢీకొనడంతో భారీ శబ్దం వినిపించగా, స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అయితే ఈ ప్రమాదంలో అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా (Twinkle Khanna)కు ఎలాంటి గాయాలు కాకపోవడం ఊరటనిచ్చే అంశం. ప్రమాదం జరిగిన వెంటనే అక్షయ్ కుమార్ తన కారులోనే ఉండిపోకుండా వెంటనే బయటకు దిగి బాధితులకు సహాయం చేయడం అందరి మనసులను గెలుచుకుంది. సెక్యూరిటీ వాహనం కింద ఆటో డ్రైవర్‌తో పాటు మరో ప్రయాణికుడు చిక్కుకుపోయారు. పరిస్థితిని గమనించిన అక్షయ్, తన సిబ్బందితో కలిసి స్వయంగా ఆటోను పైకి లేపి, లోపల ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా (Social Media)లో వేగంగా వైరల్ అవుతున్నాయి.
ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్, ప్రయాణికుడికి స్వల్ప గాయాలు అయ్యాయని సమాచారం. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. సంఘటనపై సమాచారం అందుకున్న ముంబై పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ప్రమాదానికి కారణమైన మెర్సిడెస్ కారు డ్రైవర్‌ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా తమ 25వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునేందుకు ఇటీవల విదేశాలకు వెళ్లారు. అక్కడ వేడుకలు ముగించుకుని ముంబైకి తిరిగివచ్చిన కొద్ది గంటల్లోనే ఈ ప్రమాదం జరగడం గమనార్హం. ప్రస్తుతం అక్షయ్ కుటుంబంతో పాటు ఆటోలో ఉన్నవారంతా సురక్షితంగానే ఉన్నారని సమాచారం. ఈ ఘటనతో అక్షయ్ కుమార్ కేవలం స్టార్ హీరో మాత్రమే కాకుండా, నిజ జీవితంలోనూ మానవత్వం కలిగిన వ్యక్తిగా మరోసారి అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నారు.