అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Akhanda 2 | బోయపాటి (Boyapati) దర్శకత్వంలో బాలయ్య హీరోగా తెరకెక్కిన అఖండ 2 సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో బాలకృష్ణ ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠతో మూవీ కోసం ఎదురు చూస్తున్నారు.
అఖండ 2 మూవీ టికెట్ రేట్ల పెంపునకు తాజాగా తెలంగాణ ప్రభుత్వం సైతం ఆమోదం తెలిపింది. ఇప్పటికే ధరలు పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఓకే చెప్పిన విషయం తెలిసిందే. టికెట్ రేట్లు పెంచాలంటే అందులో 20శాతం సినీ కార్మికులకు అందించాలని గతంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం సినిమా పరిశ్రమ కార్మికులకు మద్దతుగా థియేటర్లు పెరుగుతున్న ఆదాయంలో 20 శాతం మూవీ ఆర్టిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు అందించాలని పేర్కొంటూ టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది.
Akhanda 2 | పెరిగిన రేట్లు ఇలా..
సింగిల్ స్క్రీన్లు ధర రూ.50, మల్టీ ప్లెక్స్ ధర రూ.100 పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పెరిగిన రేట్లు డిసెంబర్ 5 నుంచి 7 వరకు మూడు రోజులు అందుబాటులో ఉంటాయి. ఏపీలో మల్టీప్లెక్స్‌లలో రూ.100, సింగిల్ థియేటర్లలో రూ.75 రేటు పెంచుకోవడానికి ప్రభుత్వం ఓకే చెప్పింది. విడుదలైన రోజు నుంచి 10 రోజుల పాటు పెంచిన రేట్లు అమలులో ఉంటాయి.
Akhanda 2 | ప్రీమియర్స్ రద్దు
అఖండ సినిమా కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు నిర్మాణ సంస్థ షాకింగ్ న్యూస్ చెప్పింది. ప్రీమియర్ షోలను రద్దు చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ప్రకటించింది. సాంకేతిక సమస్యల కారణంగా క్యాన్సిల్ చేసినట్టు వెల్లడింది. కాగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు ప్రీమియర్ షోలకు అనుమతి ఇచ్చాయి. దీంతో ఎంతోమంది అభిమానులు సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో షోలు క్యాన్సిల్ చేయడం గమనార్హం. రేపు ఉదయం ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది.
Akhanda 2 | బాలయ్య ఫ్యాన్స్‌లో జోష్
బాలయ్య అఖండ తర్వాత వీర సింహారెడ్డి సినిమాలో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత వసూళ్లు రాబట్టలేదు. దాదాపు రెండేళ్లుగా ఆయన సినిమాలు రిలీజ్ కాలేదు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ అఖండ–2 కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ మూవీపై అంచనాలను భారీగా పెంచాయి. ఈ సినిమాలో బాలకృష్ణతో పాటు సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.
