అక్షరటుడే, లింగంపేట: Lingampet | మండల కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ గురుకుల బాలుర పాఠశాలలో (Minority Residential Boys School) 2026-27 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ వెంకట రాములు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైనార్టీ వర్గాలు ఈ సదవకాశాన్ని వినియోగించుకుని తమ పిల్లలను పాఠశాలలో చేర్పించాలని సూచించారు. 2017లో పాఠశాల ప్రారంభం కాగా.. ఇప్పటివరకు ఉత్తమ నిర్వహణతో పాటు అద్భుతమైన ఫలితాలను సాధిస్తుందని తెలిపారు. పదో తరగతిలో ప్రతి ఏడాది వందశాతం ఉత్తీర్ణత సాధిస్తున్నామని, క్రీడలలోనూ జిల్లా, రాష్ట్రస్థాయిలో కూడా పాఠశాల విద్యార్థులు సత్తా చాటుతున్నారని వివరించారు.
Lingampet | బాసరలోనూ సీట్లు సాధించిన విద్యార్థులు..
తమ విద్యార్థులు పదో తరగతి తర్వాత ఐఐఐటీ బాసర (IIIT Basara) వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలలో ఉన్నత చదువులకు అవకాశం పొందారని ప్రిన్సిపాల్ తెలిపారు. గత రెండేళ్లుగా తమ విద్యార్థులు జన విజ్ఞాన వేదిక ( Jana Vignana Vedika) ఆధ్వర్యంలో నిర్వహించబడే చెకుముకి సైన్సు సంబరాల్లోనూ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలోనూ తమ విద్యార్థులు రాష్ట్రస్థాయిలో పోటీపడి ఉత్తమ స్థానంలో నిలిచారన్నారు. తెలంగాణ మైనారిటీ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న తమ పాఠశాలలో ఉత్తమ, నాణ్యమైన విద్యతో పాటుగా ప్రభుత్వం అన్ని రకాల ఉచిత సౌకర్యాలను కల్పిస్తుందని తెలిపారు.
Lingampet | ఐదో తరగతిలో..
వచ్చే 2026-27కు గాను.. ఐదో తరగతిలో మైనారిటీ పిల్లలకు 30, ఇతరులకు 10 సీట్ల చొప్పున అడ్మిషన్లు ప్రారంభమైనట్లు పాఠశాల ప్రతినిధులు తెలిపారు. 6, 7, 8వ తరగతుల్లో గతేడాది మిగిలిన ఖాళీలకు కేవలం మైనారిటీ విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా మైనార్టీ గురుకుల కళాశాలలో కూడా ఎంపీసీ, బైపీసీ కోర్సులలో అడ్మిషన్లు జరుగుతున్నాయని విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని వారు కోరారు. అనంతరం పాఠశాల గోడప్రతులను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి షౌకత్ అలీ, కళాశాల ప్రిన్సిపాల్ మధుసూదన్ రావు, సీనియర్ స్కూల్ అసిస్టెంట్ వాహిన్షీద్ సిద్దిఖీ, సదర్లు ఫరూఖ్, వాహిద్, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (Pradesh Congress Committee) మైనారిటీ విభాగం రాష్ట్ర జనరల్ సెక్రెటరీ రఫీక్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఖాసిఫ్, మండల యువజన విభాగం అధ్యక్షుడు ఖయ్యూం, అర్షద్, మౌల్వి నజీరుద్దీన్లు పాఠశాల సమన్వయకర్త రామ్ గోపాల్, పాఠశాల, కళాశాల ఉపాధ్యాయ, అధ్యాపక బృందాలతో పాటు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.