అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hanmakonda | అవినీతి అధికారుల తీరుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లంచాలు ఇస్తేనే కొంత మంది అధికారులు పనులు చేస్తున్నారు. దీంతో ప్రజలు తప్పని పరిస్థితుల్లో డబ్బులు ఇచ్చి పనులు చేయించుకుంటున్నారు. అయితే అలాంటి అధికారులు ఏసీబీకి చిక్కితే ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.
హన్మకొండ కలెక్టరేట్ (Hanamkonda Collectorate) ఎదుట శనివారం ఊరుగొండ రైతులు సంబరాలు చేసుకున్నారు. హన్మకొండ అదనపు కలెక్టర్, జిల్లా ఇన్‌ఛార్జి విద్యాధికారి వెంకట్ రెడ్డి శుక్రవారం ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. ఓ ప్రైవేట్ కాలేజీ గుర్తింపును రెన్యువల్ చేయడానికి ఆయన రూ.60 వేల లంచం డిమాండ్ చేశాడు. డబ్బులు తీసుకుంటుండగా.. అదనపు కలెక్టర్‌తో పాటు డీఈవో ఆఫీస్ (DEO Office)లోని సీనియర్ అసిస్టెంట్ మొహమ్మద్ గౌసుద్దీన్, హన్మకొండ ప్రాథమిక పాఠశాల విభాగపు జూనియర్ అసిస్టెంట్ కన్నెబోయిన మనోజ్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
Hanmakonda | టపాసులు కాల్చి..
అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి ఏసీబీకి చిక్కడంతో ఊరుగొండ రైతులు కలెక్టరేట్ ఎదుట టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. గ్రీన్ ఫీల్డ్ హైవే (Greenfield Highway)లో ఆ గ్రామస్తులు భూములు కోల్పోయారు. అయితే తమకు సరైన నష్టపరిహారం ఇవ్వకుండా వెంకటరెడ్డి అడ్డుపడ్డారని వారు ఆరోపించారు. ఈ మేరకు తమ ఉసురు తగిలిందని రైతులు నినాదాలు చేశారు. ఇటీవల మెదక్ జిల్లా టేక్మాల్‌లో ఎస్సై ఏసీబీకి చిక్కగ మండల ప్రజలు పోలీస్ స్టేషన్ (Police Station) ఎదుట సంబరాలు చేసుకున్న విషయం తెలిసిందే. గతంలో ఓ తహశీల్దార్ కార్యాలయం ఎదుట సైతం రైతులు ఇలాగే సంబరాలు చేసుకున్నారు. అయినా అవినీతి అధికారులు నిస్సిగ్గుగా లంచాలు తీసుకుంటునే ఉన్నారు.
