అక్షరటుడే, వెబ్‌డెస్క్: Balmuri Venkat | సినీ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్‌పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ (MLC Balmuri Venkat) డిమాండ్ చేశారు. మహాత్మాగాంధీని (Mahatma Gandhi) కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
సినీ నటుడు శివబాలాజీతో (actor Shiva Balaji) కలిసి ఆయన శనివారం హైదరాబాద్‌లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణును కలిశారు. జాతిపిత గాంధీని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టు చేసిన నటుడు శ్రీకాంత్ అయ్యంగార్‌పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సంబంధిత వీడియోలను సైతం అందజేశారు. అనంతరం వెంకట్ విలేకరులతో మాట్లాడారు.
మహాత్మాగాంధీని కించపరిచేలా శ్రీకాంత్ అయ్యంగార్ (Srikanth Iyengar) సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్నారు. ఆయనపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశానని, ఇప్పుడు మా అసోసియేషన్‌కు కూడా ఫిర్యాదు అందించినట్లు తెలిపారు. గాంధీ అభిమానుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన వీడియోను కూడా సమర్పించామన్నారు. జాతిపితను కించపరిచేలా వ్యాఖ్యానించిన వారి పట్ల మా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.
ఈ వ్యవహారంలో సినీ ప్రముఖులు చిరంజీవి, బాలకృష్ణ (Bala Krishna), మోహన్‌బాబు, పవన్‌కల్యాణ్, నాగార్జున వారు స్పందించాలని కోరారు. జాతిపిత గురించి తప్పుగా మాట్లాడితే మీరు కూడా బయటకు వచ్చి ఖండించాలని విన్నవించారు. జాతిపితను ఎవరూ అవమానించిన సహించబోమనే సందేశాన్ని ఇవ్వాలని సూచించారు. భావన ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం సరికాదని సినీ నటుడు శివబాలాజీ అన్నారు. ఎవరైనా సరే మాట్లాడే ముందు ఆలోచించుకోవాలని హితవు పలికారు.