అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Trap | మరో అవినీతి అధికారి ఏసీబీ వలకు చిక్కాడు. ప్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం లంచం తీసుకుంటున్న ఇన్‌ఛార్జి సబ్ రిజిస్ట్రార్ (Sub-Registrar)ను అధికారులు బుధవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
వికారాబాద్ (Vikarabad) జిల్లాలోని తాండూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ సాయికుమార్ ఇన్‌ఛార్జి సబ్ రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తున్నాడు. ఓ వ్యక్తికి సంబంధించిన 11 ప్లాట్లలో రిజిస్ట్రేషన్ అయిన 4 ప్లాట్ల దస్తావేజులను అప్పగించడంతో పాటుగా మిగిలిన 7 ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి ఆయన లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ (ACB) అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుదారుడి నుంచి రూ.16,500 లంచం తీసుకుంటుంగా.. ఏసీబీ అధికారులు ఇన్‌ఛార్జి సబ్ రిజిస్ట్రార్ సాయికుమార్‌తో పాటు డాక్యమెంట్ రైటర్ డి సాయికుమార్, అసిస్టెంట్ డాక్యమెంట్ రైటర్ డి అశోక్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ACB Trap | తనిఖీలు చేస్తున్నా..
రాష్ట్రంలోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి రాజ్యం ఏలుతోంది. డాక్యుమెంట్ రైటర్లు (Document writers), బ్రోకర్లతో కుమ్మక్కై ఆఫీసుల్లోని సిబ్బంది లంచాలు తీసుకుంటున్నారు. కార్యాలయాల్లో ప్రైవేట్ వ్యక్తులు ఉండొద్దని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నా.. డాక్యుమెంట్ రైటర్లు అక్కడే తిష్ట వేస్తున్నారు. పనుల కోసం వచ్చే వారు ముందు వీరిని కలిస్తేనే రిజిస్ట్రేషన్లు చేసి పెడుతున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతిపై ఏసీబీతో పాటు ప్రభుత్వానికి భారీ ఎత్తున ఫిర్యాదులు వెళ్తున్నాయి. దీంతో ఏసీబీ అధికారులు పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆకస్మిక సోదాలు నిర్వహిస్తున్నారు.
ACB Trap | 23 బృందాలతో..
ఏసీబీ అధికారులు నవంబర్ 14న 23 బృందాలుగా పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. ఆయా ఆఫీసుల్లో లెక్కల్లో చూపని రూ. 2,51,990 నగదు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 289 రిజిస్టర్డ్ పత్రాలు కూడా గుర్తించారు. దాదాపు 19 మంది ప్రైవేట్ వ్యక్తులు, 60 మంది డాక్యుమెంట్ రైటర్లు కూడా ఎటువంటి అనుమతి లేకుండా కార్యాలయాల్లో ఉన్నట్లు గుర్తించారు. అలాగే 13 మంది సబ్ రిజిస్ట్రార్ ఇళ్లలో కూడా ACB దాడి చేసి నగదు, నగలు, ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకుంది. అయినా అవినీతి అధికారులు మాత్రం లంచం తీసుకోవడం మానడం లేదు.
