అక్షరటుడే, నిజామాబాద్ క్రైం : Makloor Mandal | మాక్లూర్ మండలం బోర్గాం(కె)లో భర్తను భార్య హత్య చేసిన కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. పక్కా ప్రణాళిక ప్రకారం ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని బోర్గాం(కె) (Borgam(K))లో రమేష్, సౌమ్యకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే భార్య సౌమ్యకు దిలీప్ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడడంతో ఈ విషయం తెలిసిన భర్త పలుమార్లు హెచ్చరించాడు. ఈక్రమంలో భర్తను హత్య చేసేందుకు భార్య సౌమ్య పన్నాగం పన్నింది.
Makloor Mandal | పక్కా ప్రణాళిక వేసి..
ముందుగా ఆర్మూర్ (Armoor) ప్రాంతంలో కారుతో భర్తను యాక్సిడెంట్ చేయించి హత్య చేయించేందుకు సౌమ్య ప్రయత్నించింది. కాని ఈ ప్రమాదంలో రమేష్ కొద్దిపాటి గాయాలతో బయటపడ్డాడు. దీంతో మరోసారి సుపారీ గ్యాంగ్‌తో హత్యకు ప్లాన్ వేసింది. వారికి తన రింగ్‌ను కుదువపెట్టి రూ. 35వేలు సమకూర్చింది. డిసెంబర్19వ తేదీన రాత్రి నీళ్లల్లో నిద్రమాత్రలు కలిపి భర్తకు ఇవ్వగా నీళ్లు తాగిన రమేష్ నిద్రలోకి జారుకున్నాడు. ఈ క్రమంలో సుపారీ గ్యాంగ్‌ను సంప్రదించగా వారు ఆ రాత్రి లైన్లోకి రాలేదు. దీంతో ప్రియుడు దిలీప్‌తో కలిసి భార్య సౌమ్య భర్త రమేష్ హత్యకు పూనుకుంది. రమేష్ ముఖంపై దిండుతో అదిమిపట్టి.. టవల్‌తో ఉరి బిగించి హత్య చేసింది.
Makloor Mandal | రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం..
తెల్లారిన తర్వాత తన భర్త గుండెపోటు (Heart Attack)తో మరణించాడని అందరినీ నమ్మించి అంత్యక్రియలు సైతం పూర్తిచేసింది. కాని అతడిది సాధారణ మరణం కాదని గ్రహించిన రమేష్ తమ్ముడు ఇజ్రాయిల్ నుంచి అనుమానం వ్యక్తం చేసి తన భార్యతో స్థానిక మాక్లూర్ పోలీసు (Makloor Police)లకు ఫిర్యాదు ఇప్పించాడు. ఇలా నిందితురాలు సౌమ్య డొంక కదిలింది. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయండంతో సౌమ్య తన భర్తను ప్రియుడు దిలీప్‌తో కలిసి హత్య చేసినట్లు ఒప్పుకుంది. రమేష్‌ది సాధారణ మరణం అని నిర్ధారణ అయ్యాక వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులు (Insurance Money) రూ.2 కోట్లకు పైగా డబ్బులతో పరారయ్యేందుకు ప్లాన్ చేసినట్లు ఒప్పుకుంది. పూర్తి వివరాలు త్వరలోనే పోలీసులు వెల్లడించనున్నారు.