అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Question paper leakage | ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో (Professor Jayashankar Agriculture University) పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో వరంగల్ వ్యవసాయ కాలేజీ (Warangal Agriculture College) సిబ్బంది పాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
హైదరాబాద్‌లోని (Hyderabad) రాజేంద్రనగర్‌లో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉంది. దీని పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా పలు కాలేజీలు ఉన్నాయి. అయితే ఈ యూనివర్సిటీలోని సిబ్బంది, కొందరు విద్యార్థులు కలిసి సెమిస్టర్ ప్రశ్నాపత్రాలు లీక్ చేసినట్లు అధికారులు గతంలో గుర్తించారు. ముఖ్యంగా వ్యవసాయ శాఖలో (agriculture department) ఏఈవోలు పని చేస్తూ యూనివర్సిటీలో ఇన్ సర్వీస్ కోటా కింద చదువుతున్న 35 మంది కలిసి దీనికి పాల్పడ్డట్లు తేల్చారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పలువురు యూనివర్సిటీ సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఇన్‌సర్వీస్ కోటా కింద చదువుతున్న 35 మందిని డిస్మిస్ చేసి, వ్యవసాయ శాఖకు సరెండర్ చేశారు. అయితే తాజాగా ఈ వ్యవహారం వరంగల్ కాలేజీ సిబ్బంది పాత్ర ఉన్నట్లు గుర్తించారు.
Question paper leakage | 8 మంది ప్రవేశాలు రద్దు
వరంగల్ కాలేజీ సిబ్బంది సైతం లీకేజీకి సహకరించినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో ఓ ఉన్నతాధికారితో పాటు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేశారు. 8 మంది ఇన్ సర్వీస్ విద్యార్థుల ప్రవేశాలను రద్దు చేశారు. లీకేజ్ వ్యవహారంపై ముగ్గురు అధికారులతో ప్రత్యేక కమిటీని యూనివర్సిటీ అధికారులు ఏర్పాటు చేశారు. పలు వ్యవసాయ కాలేజీల్లో కమిటీ సభ్యుల రహస్య విచారణ చేపట్టనున్నారు.
Question paper leakage | వారిని సస్పెండ్ చేయాలి
వ్యవసాయ శాఖలో ఏఈవోలు పని చేస్తూ.. ఇన్‌సర్వీస్ కోటాలో చదువుతున్న పలువురు పేపర్ లీకేజీలకు పాల్పడ్డారు. పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని వాట్సాప్‌లో పేపర్లను లీక్ చేసినట్లు తెలిసింది. దీంతో యూనివర్సిటీ అధికారులు వారిని డిస్మిస్ చేశారు. అయితే వ్యవసాయ శాఖ అధికారులు సైతం వారిని ఉద్యోగాల్లో నుంచి సస్పెండ్ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారు విధులు సక్రమంగా నిర్వహిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు.