అక్షరటుడే, వెబ్డెస్క్: Donald Trump | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలెట్లు విమానాన్ని వెనక్కి మళ్లించారు.
స్విట్జర్లాండ్ (Switzerland)లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనడానికి ట్రంప్ మంగళవారం రాత్రి(యూఎస్ కాలమానం ప్రకారం) ఎయిర్ ఫోర్స్ వన్ విమానం (Air Force One Aircraft)లో బయలుదేరారు. అయితే ఫ్లైట్ టేకాఫ్ అయిన తర్వాత సాంకేతిక సమస్యను పైలెట్లు గుర్తించారు. ఎయిర్ ఫోర్స్ వన్‌లోని సిబ్బంది విద్యుత్ సమస్యను కనుగొన్నారు. దీంతో తిరిగి రావాలని నిర్ణయం తీసుకున్నట్లు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తెలిపారు. ట్రంప్ తిరిగి వచ్చిన తర్వాత మరొక విమానం ఎక్కి దావోస్ (Davos)లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదికకు తన పర్యటనను కొనసాగిస్తారు.
Donald Trump | ప్రసంగించనున్న ట్రంప్
ప్రపంచ ఆర్థిక వేదిక (World Economic Forum) వార్షిక సమావేశం దావోస్‌లో జరుగుతోంది. ఈ శిఖరాగ్ర సమావేశంలో రాజకీయ నాయకులు, CEOలు, టెక్నాలజీ కార్యనిర్వాహకులు, ప్రధాన అంతర్జాతీయ సంస్థల అధిపతులు సహా 130 కి పైగా దేశాల నుంచి 3,000 మంది పాల్గొంటారు. ఈ సంవత్సరం సమావేశం థీమ్ ‘సంభాషణ స్ఫూర్తి’. యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జనవరి 21న సమావేశంలో ప్రసంగించనున్నారు. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 7 గంటలకు ట్రంప్ మాట్లాడుతారు.