అక్షరటుడే, వెబ్‌డెస్క్: America | అమెరికాను మంచు తుపాన్ (Heavy snowfall) వణికిస్తోంది. భారీగా మంచు కురుస్తుండటంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. వేల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దు అయ్యాయి.
మిడ్‌వెస్ట్, తూర్పు తీరంలో మంచు కురుస్తుంది. సాధారణంగా చల్లగా ఉండే ఫ్లోరిడాతో సహా దక్షిణ ప్రాంతాలలో దాదాపు గడ్డకట్టే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు. భారీ మంచు తుపాను కారణంగా పలు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈశాన్య ఒహియోలో అకస్మాత్తుగా భారీ మంచు, ఈదురుగాలులు వీచడంతో తెల్లవారుజామున మంచు తుపాను పరిస్థితులు ఏర్పడ్డాయి. మంచు తుఫాను పరిస్థితులు క్లీవ్‌ల్యాండ్ మెట్రో ప్రాంతంలోకి వ్యాపించాయి. తూర్పున పెన్సిల్వేనియా, న్యూయార్క్‌లోని (New York) కొన్ని ప్రాంతాలలో ప్రభావం ఉంది.
America | రోడ్లపై పేరుకుపోయిన మంచు
భారీగా మంచు కురుస్తుండటంతో రోడ్లపై పేరుకుపోయింది. అధికారులు రోడ్లను క్లియర్ చేస్తున్నారు. మంచు ప్రభావంతో వాహనాలు కనిపించని పరిస్థితి. ప్రయాణం కష్టంగా మరియు ప్రమాదకరంగా ఉంటుందని నేషనల్ వెదర్ సర్వీస్ (National Weather Service) హెచ్చరించింది. సోమవారం సైతం తూర్పు యూఎస్‌లో సగటు కంటే తక్కువ నమోదు అవుతాయని పేర్కొంది. ఆదివారం రాత్రి ఎగువ మిడ్‌వెస్ట్‌లో అతి శీతలమైన గాలులు వీస్తాయని అంచనా వేసింది. శనివారం రాత్రి తూర్పు తీరం వెంబడి మంచు తుపాన్ ప్రారంభం అయింది. ఆదివారం రాత్రి నాటికి కనెక్టికట్, మసాచుసెట్స్, రోడ్ ఐలాండ్‌ను మంచు కప్పేస్తుందని అధికారులు తెలిపారు.