అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Maharashtra | మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్సీపీ శరద్‌పవార్ (NCP Sharad Pawar), అజిత్ పవార్ పార్టీలు కలిసిపోయాయి. ఈ మేరకు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ సోమవారం ప్రకటించారు.
మహారాష్ట్రలో త్వరలో స్థానిక ఎన్నికలు (Local Elections) జరగనున్నాయి. ముంబయి మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు 28 కార్పొరేషన్లు, 32 జిల్లా కౌన్సిళ్లు, 336 పంచాయతీ సమితులకు ఎన్నికలు జరగనున్నాయి. జనవరి 15న ఒకే విడతలో జరగనున్న ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీతో తమ పార్టీ పొత్తు పెట్టుకుంటున్నట్లు తాజాగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (Nationalist Congress Party) (శరద్చంద్ర పవార్) నాయకుడు రోహిత్ పవార్ తెలిపారు. ఎన్నికల్లో ప్రత్యర్థి వర్గంతో కలిసి వెళ్లాలని పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు.
Maharashtra | శరద్ పవార్ నాయకత్వం
పింప్రి చించ్వాడ్ మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) కోసం రెండు వర్గాల మధ్య పొత్తును అజిత్ పవార్ ప్రకటించారు. పలువురు కార్యకర్తలు వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే వద్దకు వచ్చి, రెండు వర్గాలు కలిసి ముందుకు సాగాలని చెప్పారని రోహిత్ పవార్ తెలిపారు. స్థానిక పార్టీ కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని ఈ పొత్తుపై నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు. ఈ కూటమికి తన బాబాయి శరద్ పవార్ నాయకత్వం వహిస్తారని అజిత్ తెలిపారు. ఈ రెండు పార్టీలు పూణే, పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ ఎన్నికలలో కలిసి పోటీ చేస్తాయని ఆయన తెలిపారు.
Maharashtra | సీట్ల పంపకాలు
పూణే, పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్లతో సహా మహారాష్ట్రలోని 29 మున్సిపల్ సంస్థలకు జనవరి 15న ఎన్నికలు జరగనున్నాయి. మరుసటి రోజు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రేపటితో నామినేషన్ల గడువు ముగియనుంది. ఈ క్రమంలో రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకోవడం గమనార్హం. గతంలో అజిత్ పవార్ ఎన్సీపీని చీల్చారు. అనంతరం ఎన్డీఏ కూటమిలో చేరి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. తాజాగా ఎన్డీఏ కూటమిలోని ఎన్సీపీ, యూపీo కూటమిలోనీ ఎన్సీపీ (ఎస్పీ) పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. కాగా.. ఇటీవల ఉద్దవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే సైతం కలిసి పోయిన విషయం తెలిసిందే.