అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Sarpanch Elections | రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. ఏ గ్రామంలో చూసినా ఎన్నికల కోలహాలం కనిపిస్తోంది. రెండో విడత నామినేషన్ల పర్వం నేటితో ముగియనుంది. ఈ క్రమంలో సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థులు గెలుపు కోసం అనేక కష్టాలు పడుతున్నారు. గ్రామస్తులపై వరాల జల్లు కురిపిస్తున్నారు.
పంచాయతీ ఎన్నికల్లో (Panchayat Elections) గెలవడానికి అభ్యర్థులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కుల సంఘాలను మచ్చిక చేసుకుంటున్నారు. అలాగే పలు చోట్ల ప్రజలకు విందులు ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో డబ్బులు పంచుతున్నారు. అయితే కొంతమంది అభ్యర్థులు మాత్రం వినూత్నంగా ఆలోచిస్తున్నారు. తాము గెలిస్తే ఏం చేస్తామో చెబుతూ బాండ్లు రాసిస్తున్నారు. గ్రామస్తులపై వరాల జల్లు కురిపిస్తున్నారు.
Sarpanch Elections | ఆడపిల్ల పుడితే రూ.2 వేలు
మెదక్ జిల్లా (Medak District) హవేలీ ఘన్పూర్ మండలం కప్రాయిపల్లి సర్పంచ్‌గా బీఆర్ఎస్ మద్దతుతో కుక్కల మౌనిక పోటీ చేస్తోంది. తాను గెలిస్తే ఏం చేస్తానో ఆమె రూ.100 బాండ్ పేపర్‌పై రాసి ఇచ్చింది. 15 హామీలు అందులో పేర్కొంది. తనను గెలిపిస్తే ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని లేకుంటే తనను తొలగించవచ్చని తెలిపింది. గ్రామంలో ఎవరికైనా ఆడపిల్ల పుడితే రూ.2 వేలు ఇస్తానని హామీ ఇచ్చింది. తీజ్ పండుగకు రూ.20 వేలు, ముదిరాజ్ బోనాలకు రూ.8 వేలు, ఎల్లమ్మ బోనాలకు రూ.3 వేలు, గ్రామంలో ఎవరైనా మృతి చెందితే అంత్యక్రియల కోసం రూ.5 వేలు ఇస్తానని హామీ ఇచ్చింది.
Sarpanch Elections | రూ.5 లక్షల బీమా
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొత్తపేట గ్రామం (Kothapeta Village)లో సర్పంచ్ అభ్యర్థి రూ.5 లక్షల జీవిత బీమా చేయిస్తానని హామీ ఇచ్చాడు. తనను గెలిపిస్తే ప్రతి ఇంటికి రూ.5 లక్షల చొప్పున జీవిత బీమా చేస్తానని వనమ్మ నరసింహ యాదవ్ ప్రకటించాడు. ఆ గ్రామంలో 700 కుటుంబాలు ఉన్నాయి. అంతేగాకుండా ఆడపిల్ల పుడితే రూ.5 వేల ఫిక్స్‌డ్ డిపాజిట్, అమ్మాయిల పెళ్లికి పుస్తె మెట్టెలు, అబ్బాయి వివాహనికి రూ.5,116 ఇస్తానని హామీ ఇచ్చాడు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉచితంగా నోట్ పుస్తకాలు, బ్యాగులు, శివరాత్రి, శ్రీరామ నవమి, మొహరం సందర్భంగా అన్నదానం, రంజాన్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తానని పేర్కొన్నాడు.
గద్వాల జిల్లా (Gadwal District) గట్టు మండలం సల్కాపరం గ్రామంలో తనను గెలిపిస్తే 22 హామీలే అమలు చేస్తానని ఓ అభ్యర్థి బాండ్ పేపర్ రాసిచ్చాడు. హామీలు అమలు చేయకపోతే పదవి నుంచి తప్పుకుంటానని పేర్కొన్నాడు. ప్రజలు ఈ హామీలపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. వీరికి పట్టం కడుతారా.. పక్కన పెడుతారా అనేది పోలింగ్ రోజు తేలనుంది.
