అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Tirupati | తిరుపతిలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. శ్రీవారి మెట్ల మార్గంలో శుక్రవారం ఉదయం చిరుత ప్రత్యక్షం కావడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు.
తిరుపతిలో కొంతకాలంగా చిరుతలు సంచరిస్తున్న విషయం తెలిసిందే. మెట్ల మార్గం, ఎస్వీ యూనివర్సిటీ (SV University) ప్రాంతంలో తరచూ చిరుతలు కనిపిస్తుండటంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం ఉదయం శ్రీవారి 450వ మెట్టు మార్గంలో చిరుత కనిపించింది. దానిని చూసిన భక్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అనంతరం అది అడవిలోకి వెళ్లిపోయింది. భక్తులు ఈ విషయాన్ని టీటీడీ అధికారులకు సమాచారం అందించారు.
Tirupati | భక్తుల నిలిపివేత
టీటీడీ, అటవీ శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పెద్ద శబ్ధాలు చేస్తూ చిరుతను అడవిలోకి తరిమే ప్రయత్నం చేశారు. చిరుత సంచారంతో టీటీడీ అధికారులు (TTD Officers) ఆ మార్గంలో భక్తులను అనుమతించడం లేదు. అటవీ శాఖ నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాతే ఆ మార్గంలో భక్తులను గుంపులుగా అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
గతంలో సైతం పలుమార్లు చిరుత కనిపించింది. నవంబర్‌లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం క్యాంపస్ (Sri Venkateswara University Campus)లోకి చిరుత రావడంతో విద్యార్థులు, సిబ్బంది ఆందోళన చెందారు. ఎస్వీ యూనివర్సిటీ ఎంప్లాయీస్ క్వార్టర్స్ వద్ద నాటుకోళ్ల షెడ్‌పై రాత్రి సమయంలో చిరుత (Leopard) దాడి చేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డు అయ్యాయి. యూనివర్సిటీ పరిసరాల్లో మూడు చిరుతలు సంచరిస్తున్నట్లు సమచారం.