IPL 2025 | ఢిల్లీపై ఘన విజయం.. ఆర్‌సీబీదే అగ్రస్థానం!
IPL 2025 | ఢిల్లీపై ఘన విజయం.. ఆర్‌సీబీదే అగ్రస్థానం!

అక్షరటుడే, వెబ్​డెస్క్ :IPL 2025 | ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) జోరు కొనసాగుతోంది. ఆల్‌రౌండర్ ప్రదర్శనతో మరో విజయాన్ని ఆర్‌సీబీ(RCB) ఖాతాలో వేసుకుంది. ఆదివారం అరుణ్‌జైట్లీ మైదానం(Arun Jaitley Stadium) వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆర్‌సీబీ 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌(Delhi Capitals)ను ఓడించింది. ఈ విజయంతో బెంగళూరు వేదికగా ఎదురైన పరాజయానికి ఆర్‌సీ‌బీ ప్రతీకారం తీర్చుకుంది. ప్రత్యర్థి మైదానాల్లో ఆర్‌సీబీకి ఇది వరుసగా ఆరో విజయం కావడం విశేషం.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(39 బంతుల్లో 3 ఫోర్లతో 41), ట్రిస్టన్ స్టబ్స్(18 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 34) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆర్‌సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్(3/33) మూడు వికెట్లతో ఢిల్లీ పతనాన్ని శాసించగా.. జోష్ హజెల్ వుడ్(2/36) రెండు వికెట్లు పడగొట్టాడు. యశ్ దయాల్, కృనాల్ పాండ్యాకు చెరో వికెట్ దక్కింది.

అనంతరం ఆర్‌సీబీ(RCB) 18.3 ఓవర్లలోనే 4 వికెట్లకు 165 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. కృనాల్ పాండ్యా(47 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 73 నాటౌట్), విరాట్ కోహ్లీ(47 బంతుల్లో 4 ఫోర్లతో 51) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 119 పరుగులు జోడించారు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ 2 వికెట్లు తీయగా.. చమీర ఒక వికెట్ పడగొట్టాడు. ఈ గెలుపుతో ఆర్‌సీబీ పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థాన్నా కైవసం చేసుకుంది.

10 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో 14 పాయింట్లు ఖాతాలో వేసుకున్న ఆర్‌సీబీ(RCB).. ప్లే ఆఫ్స్‌కు అడుగు దూరంలో నిలిచింది. మరో మ్యాచ్ గెలిస్తే అధికారికంగా ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకుంటుంది. ఆర్‌సీబీ తమ తదుపరి మ్యాచ్‌ల్లో సీఎస్‌కే(మే 3), లక్నో సూపర్ జెయింట్స్(మే 9), సన్‌రైజర్స్ హైదరాబాద్‌(మే 13), కేకేఆర్(మే17)లతో తలపడనుంది.