అక్షరటుడే, వెబ్డెస్క్: Chinese Manja | చైనా మాంజాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మనుషులు, పక్షుల ప్రాణాలకు ప్రమాదకరంగా మారిన దీని నివారణకు చర్యలు చేపట్టారు.
సంక్రాంతి పండుగ (Sankranti Festival) సమీపిస్తోంది. ఆకాశంలో గాలిపటాలు సందడి చేస్తున్నాయి. యువత, చిన్నారులు ఉత్సాహంగా పతంగులు ఎగుర వేస్తున్నారు. అయితే పలువురు చైనా మాంజా వినియోగిస్తున్నారు. దీనిపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నా మారడం లేదు. దీంతో హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) చైనా మాంజాపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నగర సీపీ సజ్జనార్ (CP Sajjanar) చైనా మాంజాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ మేరకు పోలీసులు నిత్యం ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు.
Chinese Manja | నాలుగు రోజుల్లో
హైదరాబాద్ నగరవ్యాప్తంగా చైనీస్ మాంజాపై స్పెషల్ డ్రైవ్ ముమ్మరంగా కొనసాగుతోందని సీసీ సజ్జనార్ తెలిపారు. ఈ నెల 8 నుంచి 11వ తేదీ వరకు రూ.43 లక్షల విలువైన 2,150 బాబిన్లను సీజ్ చేశామన్నారు. పర్యావరణానికి, పక్షులకు, మనుషుల ప్రాణాలకు ముప్పు కలిగించే ఈ నిషేధిత మాంజాను విక్రయిస్తున్న వ్యవహారంలో 29 కేసులు నమోదు చేసి.. 57 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. గత నెల రోజుల్లో నమోదైన 132 కేసుల్లో.. రూ. 1.68 కోట్ల విలువైన 8,376 బాబిన్లను స్వాధీనం చేసుకొని, మొత్తంగా 200 మందిని అరెస్ట్ చేశారు. నిషేధిత మాంజాను విక్రయించినా, కొనుగోలు చేసినా జైలు శిక్ష తప్పదని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.
Chinese Manja | పలువురికి గాయాలు
చైనా మాంజాతో హైదరాబాద్ నగరంలో ఇప్పటికే పలువురు గాయపడ్డారు. అంబర్పేట ఫ్లై ఓవర్పై బైక్ వెళ్తున్న వ్యక్తికి చైనా మాంజా కోసుకుంది. ఇటీవల ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి సైతం గాయపడ్డాడు. దీంతో పోలీసులు తనిఖీలు మరింత తీవ్రం చేశారు. గాలిపటం ఎగరాల్సింది ఆకాశంలో.. అమాయక ప్రాణాల్లో కాదని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. చైనీస్ మాంజా దారం తెగదు.. కానీ మనుషుల మెడలు, పక్షుల రెక్కలు తెగ్గోస్తుందని ఆయన అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా అవగాహన కల్పిస్తున్నారు.