అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Thailand | థాయిలాండ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కదులుతున్న రైలుపై క్రేన్ పడటంతో 22 మంది చనిపోయారు. బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది.
బ్యాంకాక్ (Bangkok) నుంచి థాయిలాండ్‌లోని ఈశాన్య ప్రావిన్స్‌కు వెళ్తున్న రైలుపై క్రేన్ పడింది. ఈ మార్గంలో హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్ కోసం నిర్మాణ పనులు సాగుతున్నాయి. కింద రైల్వే ట్రాక్ ఉండగా.. పైన పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఓ క్రేన్ ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. అయితే అదే సమయంలో ఆ మార్గంలో రైలు రావడంతో ఒక బోగిపై అది పడిపోయింది. ఈ ఘటనలో 22 మంది మరణించగా, కనీసం 30 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. బ్యాంకాక్ కు ఈశాన్యంగా 230 కి.మీ దూరంలో ఉన్న నఖోన్ రాట్చసిమా ప్రావిన్స్‌లోని సిఖియో జిల్లా (Sikhio District)లో ఈ ప్రమాదం జరిగింది.
Thailand | పట్టాలు తప్పిన రైలు
రైలు థాయిలాండ్‌లోని ఉబోన్ రాట్చని ప్రావిన్స్‌కు వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఒక క్రేన్ హై-స్పీడ్ రైలు ప్రాజెక్టుపై పనిచేస్తుండగా అది కూలిపోయి ప్రయాణిస్తున్న రైలుపై పడిందన్నారు. దీంతో రైలు పట్టాలు తప్పింది. కొద్దిసేపు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలను మోహరించినట్లు థాయ్ ప్రభుత్వం (Thai Government) తెలిపింది. రైలులో దాదాపు 195 మంది ప్రయాణికులు ఉన్నారని థాయిలాండ్ రవాణా మంత్రి ఫిఫాట్ తెలిపారు. బాధితులను గుర్తించడానికి, గాయపడిన వారికి వైద్య సహాయం అందించడానికి చర్యలు చేపట్టామన్నారు.