అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | వేములవాడ బస్టాండ్లో (Vemulawada Bus Stand) మిస్సైన బాలుడు కామారెడ్డి బస్టాండ్లో (Kamareddy Bus stand) ప్రత్యక్షమయ్యాడు. కామారెడ్డి పట్టణ సీఐ నరహరి తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం అచ్యుత్ కుమార్ అనే మూడేళ్ల బాలుడితో కలిసి కుటుంబ సభ్యులు వేములవాడ బస్టాండ్ వద్ద బస్సు కోసం వేచి చూస్తున్నారు. తల్లిదండ్రులకు తెలియకుండా అచ్యుత్ కామారెడ్డి వైపు వస్తున్న బస్సు ఎక్కి కామారెడ్డికి వచ్చాడు. తమ కుమారుడు కనిపించకపోయేసరికి వేములవాడ పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.
Kamareddy | అప్రమత్తమైన పోలీసులు
అప్రమత్తమైన వేములవాడ పోలీసులు బస్టాండ్, పరిసర ప్రాంతాలలో వెతికినా బాలుడి ఆచూకీ లభించలేదు. దాంతో బాలుడి ఫొటోను కామారెడ్డి పోలీసులకు చేరవేశారు. దాంతో కామారెడ్డి బస్టాండ్లో వేములవాడ నుంచి వచ్చిన బస్సుల వద్ద వెతకడంతో అచ్యుత్ కుమార్ పోలీసులకు కనిపించాడు. వెంటనే తల్లిదండ్రులను కామారెడ్డి పోలీస్స్టేషన్ కు పిలిపించి బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు.