అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Tirumala | తిరుమలలో సామాన్య భక్తులకు మరింత వేగంగా, ఇబ్బందులు లేకుండా దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీ అధికారులణ/ ఆదేశించారు.
భక్తుల రద్దీని పర్యవేక్షించేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగించాలని, టీటీడీ ఆన్‌లైన్ పోర్టల్‌ను ఆర్టీజీఎస్‌తో అనుసంధానం చేసి మరింత పారదర్శకతను తీసుకురావాలని సీఎం (CM Chandrababu Naidu) సూచించారు. అలాగే అన్ని టీటీడీ సేవలను వాట్సాప్ గవర్నెన్స్‌లోకి తీసుకువచ్చే దిశగా చర్యలు వేగవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు.
Tirumala | వైకుంఠ ఏకాదశి కోసం ప్రత్యేక ఏర్పాట్లు
చిరకాలంగా తిరుమలలో అత్యధిక రద్దీ ఏర్పడే వైకుంఠ ఏకాదశి (Vaikuntha Ekadashi) సందర్భంగా, భక్తుల దర్శన సౌకర్యాలను పక్కాగా ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఎక్కడా సమస్యలు తలెత్తకుండా అధికారి వర్గాలు ముందస్తు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రస్తుతం నిమిషానికి 80 మంది భక్తులకు దర్శనం కల్పిస్తున్నట్లు టీటీడీ అధికారులు (TTD Officers) సీఎంకి నివేదించారు. పండుగలు, ప్రత్యేక రోజులలో సాధారణ భక్తులకే ప్రాధాన్యం ఇస్తున్నామని, అన్నప్రసాదం–లడ్డూ నాణ్యతను మరింత మెరుగుపరిచామని తెలిపారు. రోజుకు 2.75 లక్షల మందికి అన్నప్రసాదం అందించేందుకు కిచెన్ ఆధునీకరణ పనులు కూడా చేపడుతున్నట్లు వివరించారు.
టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆస్పత్రుల్లో అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు ప్రముఖ డాక్టర్లను “శ్రీవారి సేవకులు”గా ఆహ్వానించాలని ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. పుట్టపర్తి సత్యసాయి ఆస్పత్రుల తరహాలో సేవాభావంతో వైద్యులు తిరుమలలో పనిచేయాలని సూచించారు. తిరుపతిలోని శ్విమ్స్, రుయా, బర్డ్ వంటి కీలక ఆస్పత్రుల్లో అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు భక్తులను వెంటనే తరలించే ప్రత్యేక విధానాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తుల దృష్ట్యా అన్ని ప్రధాన భాషల్లో రిజిస్ట్రేషన్ సదుపాయం ఉండాలని సీఎం అన్నారు.
భక్తుల కోసం నిత్య అన్నదాన కార్యక్రమం అన్ని ఆలయాల్లో నిరంతరాయంగా కొనసాగాలని, సేవలు ఏ విషయంలోనూ అంతరాయం కలగవద్దని సూచించారు. దేశ, విదేశాల్లో నిర్మించే ప్రతి కొత్త ఆలయం టీటీడీ ప్రధాన ఆలయంతో అనుసంధానం చేసే విధంగా వ్యవస్థను రూపొందించనున్నట్లు అధికారులు తెలిపారు. శ్రీవారి ఆస్తులు, ధనం విషయంలో పూర్తి పారదర్శకత పాటించాలని, దుర్వినియోగం ఏదైనా చోటు చేసుకోకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. తిరుమలలో (Tirumala) అమలు చేస్తున్న ఉత్తమ పద్ధతులను రాష్ట్రంలోని ఇతర ముఖ్య ఆలయాల్లో కూడా అమలు చేయాలని సూచించారు.
