అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | రాష్ట్రవ్యాప్తంగా వీధి కుక్కల అంశం సుప్రీంకోర్టులో (Supreme Court) కేసు కొనసాగుతోంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు కుక్క కరిస్తే ప్రభుత్వం పరిహారం చెల్లించాలంటూ తీర్పునిచ్చింది.
ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన క్రమంలో.. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 600 వీధి కుక్కలను చంపి పాతి పెట్టారంటూ ఐదుగురు సర్పంచులపై జంతు ప్రేమికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో సదరు సర్పంచులపై పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదయ్యాయి. ఈ అంశం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మాచారెడ్డి మండలంలో (Machareddy mandal) జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
మాచారెడ్డి మండలంలోని భవానిపేట, పాల్వంచ, ఫరీదుపేట, వాడి, బండరామేశ్వర్ పల్లి గ్రామాల్లో 600 వీధి కుక్కలకు ఇంజక్షన్లు, విష గుళికలు ఇచ్చి చంపి పాతి పెట్టారని కరీంనగర్ జిల్లా (Karimnagar district) మల్కాపూర్‌కు చెందిన ఏదులపురం గౌతమ్ అనే జంతు ప్రేమికుడితో పాటు మరికొందరు ఎన్జీవోస్ ఈ నెల 12న మాచారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత నెలలో జరిగిన సర్పంచ్ ఎన్నికలలో వాగ్దానాలను అమలు చేయడానికి సర్పంచులు వీధి కుక్కలను చంపేశారని జంతు ప్రేమికులు ఆరోపిస్తున్నారు.
జంతు ప్రేమికుల ఫిర్యాదు మేరకు చంపేసి పూడ్చివేసిన వీధి కుక్కల (stray dogs) మృతదేహాలను జేసీబీ సహాయంతో వెలికితీసి వెటర్నరీ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసుల విచారణ అనంతరం ఐదుగురు సర్పంచులపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడీ అంశం జిల్లాలో కలకలం రేపింది. ప్రజల సౌకర్యార్థం, హాని కలగకుండా ఉండేందుకు చేసిన పని ఇప్పుడు సర్పంచుల మెడకు చుట్టుకుందన్న వాదన వినిపిస్తోంది. ఐదుగురు సర్పంచులపై కేసు నమోదు కావడంతో మిగతా సర్పంచుల్లో ఆందోళన మొదలైందన్న టాక్ వినిపిస్తోంది.
Kamareddy | ఎన్నికల హామీలో భాగంగా..
ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థులు ప్రజలకు అనేక హామిలిచ్చారు. ముఖ్యంగా గ్రామాల్లో కోతులు, కుక్కల బెడద తీవ్రంగా ఉంది. కోతుల స్వైర విహారం, వీధి కుక్కల దాడులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదే విషయమై ఎన్నికల్లో ఓటు అడగడానికి వచ్చిన సర్పంచ్ అభ్యర్థులకు ఈ సమస్యను పరిష్కరిస్తేనే ఓటేస్తామని ప్రజలు చెప్పారు. దీంతో జిల్లాలోని మెజారిటీ సర్పంచులు ఈ విషయాలపై ప్రజలకు హామిలిచ్చారు. హామీల అమలులో భాగంగా పలు గ్రామాల్లో కోతులను అడవి బాట పట్టించారు. కొందరు వీధి కుక్కలకు ఇంజక్షన్లు ఇచ్చి సమస్య పరిష్కరించినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఇదే వారికి శాపంగా మారిందన్న వాదన కూడా వినిపిస్తోంది.
Kamareddy | సర్పంచుల్లో ఆందోళన
మాచారెడ్డి మండలంలోని ఐదుగురు సర్పంచులపై కేసులు నమోదు కావడం జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. వీధి కుక్కలను చంపిన కేసులు కావడంతో జిల్లాలోని వివిధ గ్రామాల సర్పంచుల్లో ఆందోళన మొదలైనట్లుగా తెలుస్తోంది. జంతు ప్రేమికులు ఇలా మిగతా గ్రామాల సర్పంచులపై కేసులు పెడితే పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు సర్పంచులు మెదళ్లను తొలిచివేస్తున్నాయి.
Kamareddy | పోలీసుల విచారణ
మరోవైపు సర్పంచులపై నమోదైన కేసులో పోలీసులు విచారణ చేస్తున్నారు. జంతు ప్రేమికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సర్పంచులపై కేసులు నమోదు చేసిన పోలీసులు ఆయా గ్రామాల్లో విచారణ జరుపుతున్నారు. అయితే ఈ విచారణలో సర్పంచులకు వ్యతిరేకంగా ఆయా గ్రామాల ప్రజలు సాక్ష్యం చెప్తారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం ఈ కేసుల అంశం ఎటువైపు దారి తీస్తుందోనన్న చర్చ సాగుతోంది.