అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ అన్నారు. ఆమె చేపట్టిన జనహిత పాదయాత్ర ఆర్మూర్ పట్టణంలోని ఆలూరు రోడ్లు ప్రారంభమై జెండాగల్లి, గోల్ బంగ్లా, పాత బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, మామిడిపల్లి చౌరస్తా మీదుగా పెర్కిట్ వరకు సాగింది.
అనంతరం పెర్కిట్ చౌరస్తాలో ఆమె మాట్లాడుతూ పాదయాత్రలతోనే ప్రజల కష్టాలు తెలుస్తాయన్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీల ప్రాతినిధ్యం కోసం స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల బిల్లును ఆమోదింపజేశారన్నారు. ఈ బిల్లును కేంద్రం వెంటనే ఆమోదించాలని ఆమె డిమాండ్ చేశారు. కష్టాలు లేని ప్రజాస్వామ్యాన్ని నిర్మించడానికే రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు పాదయాత్రలు చేపడుతున్నామన్నారు.
Meenakshi natarajan | సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తే తప్పేముంది: టీపీసీసీ చీఫ్
పాదయాత్రలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఉదాసీనంగా వ్యవహరించడంతోనే ఈ రాద్ధాంతమంతా జరుగుతోందన్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతే తప్పేముందని, ఢిల్లీకి తప్పకుండా పోతామని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నడవాలని కేంద్రం నుంచి ప్రాజెక్టుల కోసం ఢిల్లీకి వెళ్తామని.. తమ అధినాయకత్వం సైతం ఢిల్లీలో ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు భూపతి రెడ్డి, మదన్ మోహన్ రావు, లక్ష్మీ కాంతారావు, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, సంపత్, కార్పొరేషన్ ఛైర్మన్లు మానాల మోహన్ రెడ్డి, కాసుల బాలరాజ్, మాజీ ఎంపీ మధు యాష్కీ, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి, ఆర్మూర్ నాయకులు పాల్గొన్నారు.