అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో త్వరలో 40 వేల ఉద్యోగాలు (Jobs) భర్తీ చేస్తామన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా బుధవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
సీఎం మాట్లాడుతూ.. కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చాక 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. త్వరలో మరో 40 వేల పోస్టులు ఫిల్ చేస్తామని హామీ ఇచ్చారు. యువతకు ఉద్యోగాలు రావాలని శ్రీకాంతా చారి బలిదానం చేశారని పేర్కొన్నారు. ఈ రోజే ఆయన బలిదానం చేసుకున్నారని చెప్పారు. హుస్నాబాద్ ప్రజల అభిమానం మరువలేనని సీఎం అన్నారు. 2001లో ఇక్కడి నుంచే తెలంగాణ ఉద్యమం మొదలైందని గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణ ఇస్తామని 2004లో సోనియా గాంధీ (Sonia Gandhi) కరీంనగర్లో మాట ఇచ్చి నిలబెట్టుకున్నారని చెప్పారు.
CM Revanth Reddy | ఆ ప్రాజెక్ట్‌లు పూర్తి చేస్తా..
జవహర్ లాల్ నెహ్రూ స్పూర్తితోనే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం అన్నారు. హుస్నాబాద్ అంటే సెంటిమెంట్ అని చెప్పే మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఈ ప్రాంతానికి అన్యాయం చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో హుస్నాబాద్ నిర్లక్ష్యానికి గురైందన్నారు. గౌరెల్లి రిజర్వాయర్ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల మాత్రమే అభివృద్ధి చెందాయన్నారు. కుండపల్లి, గౌరెల్లి రిజర్వాయర్లు తమ ప్రభుత్వం పూర్తి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
