అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Land Auction | హైదరాబాద్(Hyderabad)లోని రాయదుర్గం ప్రాంతంలో భూమి వేలం మరోసారి రికార్డు సృష్టించింది. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో టీజీఐఐసీ నిర్వహించిన ల్యాండ్ వేలం(Land Auction)లో, ఎకరానికి రూ.177 కోట్లు పలికింది.
ఇది ఇప్పటివరకు ఈ ప్రాంతంలో నమోదైన అత్యధిక ధర కావడం విశేషం. ఈ వేలంలో మొత్తం 7 ఎకరాలు 67 సెంట్లు భూమిని ఎంఎస్‌ఎన్ రియాలిటీస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సొంతం చేసుకుంది. సంస్థ మొత్తం రూ.1,357 కోట్లు చెల్లించి ఈ భూమిని సొంతం చేసుకుంది. గతంలో ఇదే ప్రాంతంలో ఎకరానికి రూ.100-120 కోట్ల రేంజ్‌లోనే భూములు పలికేవి. కానీ ఈ సారి ధర భారీగా పెరిగి, మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారింది.
Land Auction | ఐటీ హబ్‌లో భూమి బంగారం
ఈ భూమి, టీజీఐఐసీ అభివృద్ధి చేస్తున్న ఇండస్ట్రియల్ పార్క్‌లో భాగం. నాలెడ్జ్ సిటీ, ఫార్మా సిటీ, ఐటీ కారిడార్‌కు మధ్యనున్న ఈ భూమి ఐటీ, ఫార్మా, బయోటెక్ కంపెనీల కార్యాలయాలకు అనువుగా ఉండటం, ధర పెరగడానికి ప్రధాన కారణం. ఈ ప్రదేశాన్ని తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా అభివృద్ధి చేయాలనే యోచనలో ఉంది. ఈ వేలంలో అనేక ప్రముఖ సంస్థలు పాల్గొన్నప్పటికీ, అత్యధిక బిడ్ వేసిన ఎంఎస్‌ఎన్ రియాలిటీస్ విజయం సాధించింది. ఇప్పటికే ఈ సంస్థ రాయదుర్గం పరిధిలో కమర్షియల్, రెసిడెన్షియల్ ప్రాజెక్టులు అభివృద్ధి చేసింది. తాజాగా ఈ భూమిలో ఐటీ పార్కులు, కార్పొరేట్ ఆఫీసులు నిర్మించబోతున్నట్టు సమాచారం.
ఈ వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఆదాయం లభించిందని అధికారులు తెలిపారు. ఈ ఫండ్స్‌తో మరిన్ని ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలకు మార్గం ఏర్పడనుందని పేర్కొన్నారు. గత రెండు సంవత్సరాల్లో రాయదుర్గం(Rayadurgam)లో భూముల ధరలు రెండింతలు పెరగడం, ఈ వేలంకి నిదర్శనం.ఈ వేలం ద్వారా రాయదుర్గం ప్రాధాన్యతను మరోసారి రుజువు చేసింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో స్పష్టమవుతోంది. భవిష్యత్‌లో ఈ ప్రాంతం నేషనల్, ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్లకు ప్రాధాన్య కేంద్రంగా మారనుంది.