అక్షరటుడే, కామారెడ్డి: Sankranthi Nomulu | సంక్రాంతి అంటేనే వెరైటీలకు పెట్టింది పేరు. రకరకాల వంటకాలతో కొత్త అల్లుళ్లకు స్వాగతం పలకడం, నూతన వంటకాలతో ఇళ్లలో పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి సంవత్సరం రకరకాల నోములు నోచుకునే మహిళలు సంక్రాంతి నోములు కూడా నోచుకుంటున్నారు.
ప్రతి సంవత్సరం 20, 50, 60 రకాల నోములు నోచుకోవడం చూశాం. ఈసారి ఏకంగా 108 రకాల నోములు నోయడం కామారెడ్డి పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కామారెడ్డి పట్టణంలో గజవాడ అన్నపూర్ణ రవికుమార్ నివాసంలో 108 రకాల సంక్రాంతి పెళ్లి నోములు నోచుకున్నారు. సంవత్సరం మొత్తంలో వచ్చే పండుగల నోములు, బొట్టు పెట్టెల నోము, 13 రంగుల గాజుల నోము, గౌరమ్మ పెట్టెలు, రాఖీ ప్లేట్లు, సంక్రాంతి ప్లేట్లు, శివరాత్రి నోము, అన్నపూర్ణ దేవి విగ్రహాలు, 13 కిలోల చక్కెర, ఎదురుకొల్ల నోము, బతుకమ్మలు, సందుల సకినాలు, 13 నల్లపూసల దండల పేర్లు, ముక్కు పుడకలు, కాసుల పేర్లు, ఏడు కొండల నోము లాంటి 108 నోములు నోచుకున్నారు. ముత్తైదువులను పిలిచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గజావాడ అన్నపూర్ణ మాట్లాడుతూ.. తమ కూతురు స్పందన పెళ్లయిన తర్వాత వచ్చిన మొదటి పండగ సందర్భంగా గ్రాండ్గా సెలెబ్రేషన్ చేయాలని నిర్ణయించుకున్నామని, అందుకే 108 సంక్రాంతి పెళ్లి నోములు నోచుకున్నట్టు తెలిపారు. అనుకున్న విధంగా నోము నోచుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..: Sankranthi Special | సంక్రాంతి స్పెషల్.. కొత్త అల్లుడికి 150 వంటకాలతో విందు