అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Wrong Route Driving | హైదరాబాద్ (Hyderabad) నగరంలో ట్రాఫిక్ పోలీసులు (Traffic Police) నిత్యం వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. వాహనదారులు నిబంధనలు పాటించేలా అవగాహన కల్పిస్తున్నారు.
పోలీసులు అవగాహన కల్పిస్తున్నా.. పలువురు వాహనదారులు నిబంధనలు పాటించారు. ఇటీవల నగర సీపీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్ (CP Sajjanar) సైతం ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. ఫోన్ మాట్లాడుతూ, వీడియోలు చూస్తూ డ్రైవింగ్ చేయొద్దని హెచ్చరించారు. అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మహా నగరంలో నిత్యం ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో పోలీసులు అనేక చర్యలు చేపడుతున్నారు. భారీగా జరిమానాలు వేస్తున్నారు. అయినా పలువురు మాత్రం మారడం లేదు. తాజాగా రాంగ్ రూట్ (Wrong Route) డ్రైవింగ్‌లో ఏకంగా 10 వేల మంది పోలీసులకు చిక్కారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
Wrong Route Driving | ప్రమాదాలను నివారించడానికి..
నగరంలో రోడ్డు ప్రమాదాలకు ప్రధానంగా మద్యం తాగి వాహనాలు నడపడం, రాంగ్ రూట్లో ప్రయాణించడం కారణం అని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ప్రతి వీకెండ్లో డ్రంకన్ డ్రైవ్ స్పెషల్ తనిఖీలు చేపడుతున్నారు. తాజాగా అక్టోబర్ 1 నుంచి 7 వరకు రాంగ్రూట్లో వాహనాలు నడుపుతున్న వారి కోసం తనిఖీలు చేపట్టారు. వారం రోజుల్లో ఏకంగా 10,652 వాహనదారులు రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు చిక్కారు. వారికి జరిమానా విధించారు. అతివేగంతో సైతం రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటిపై సైతం ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
