అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Municipality Chairman Election | ఎల్లారెడ్డి మున్సిపాలిటీకి (Yellareddy Municipality) ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక సోమవారం జరగనుంది. ఉదయం 11 గంటలకు కొత్తగా ఎన్నికైన వార్డు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం కొత్త పాలకవర్గంతో సాధారణ సమావేశం నిర్వహించనున్నారు.
Yellareddy Municipality Chairman Election | సమావేశం అయ్యాక ఎన్నిక..
సమావేశం తర్వాత ఛైర్మన్, వైస్‌ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికోసం మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మున్సిపల్ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో ఎన్నికలు జరుపనున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ పది స్థానాలు, ప్రతిపక్ష బీఆర్ఎస్ ఒక స్థానం, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో విజయం సాధించారు. సమావేశంలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ అభ్యర్థులను నిర్ణయించే అవకాశం ఉంది.
ఆది నుంచి ఎమ్మెల్యే పక్కా ప్రణాళిక..
ఎమ్మెల్యే మదన్ మోహన్ (MLA Madan Mohan) మున్సిల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అభ్యర్థుల ఎంపిక నుంచి వారు విజయం సాధించేవరకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లారు. తద్వారా ఆయన ఎల్లారెడ్డి బల్దియా పీఠాన్ని హస్తగతం చేసుకున్నారు. దీంతో ఆయన ఆశీర్వాదంతోనే ఛైర్మన్, వైస్ ఛైర్మన్ అభ్యర్థుల ఎన్నిక జరుగనుంది. ఈ సందర్భంగా ఇప్పటికే రిసార్ట్‌లో ఉన్న అభ్యర్థులతో ఎమ్మెల్యే ఆదివారం రాత్రి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఛైర్మన్, వైస్‌ఛైర్మన్ ఎంపికపై చర్చలు జరిగినట్లు సమాచారం.
ఎక్స్ అఫీషియో అవసరం లేకుండానే..
బల్దియా ఎన్నికల్లో పది స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవడంతో ఎక్స్ అఫీషియో ఓటు(Ex officio vote) అవసరం కూడా లేకుండా పోయింది. ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎంపికపై కౌన్సిలర్లు ఎకతాటిపై లేనట్లు తెలుస్తోంది. పదిమంది కౌన్సిలర్లలో ఇద్దరు చైర్మన్ కోసం పోటీ పడుతున్నట్లు సమాచారం. ఏదైమైనా ఎమ్మెల్యే కనుసన్నల్లోనే బల్దియా పాలకవర్గం ఎన్నిక కానుంది.
ఏర్పాట్లను పరిశీలించిన డీఎస్పీ, కమిషనర్
మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక కోసం చేస్తున్న ఏర్పాట్లను స్థానిక డీఎస్పీ శ్రీనివాసరావు(DSP Srinivasa Rao,), మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్ ఆదివారం పరిశీలించారు. మీటింగ్ హాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. నూతన ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా మీటింగ్ హాల్, ఛైర్మన్ ఛాంబర్లలో రంగులు వేయిస్తున్నారు. మున్సిపల్ కార్యాలయం అంతా శుభ్రం చేయిస్తున్నారు. క్యాంప్‌లో ఉన్న కౌన్సిలర్లు నేరుగా సోమవారం ఉదయం 10 గంటల సమయంలో మున్సిపల్ కార్యాలయానికి చేరుకొనున్నారు. బస్సు దిగిన వారంతా ఎన్నిక జరిగే మీటింగ్ హాల్లోకి వెళ్లనున్నారు. ఎన్నికలకు సంబంధించిన అధికారులతో పాటు, శాసనసభ్యులు, 12మంది కౌన్సిలర్ల కూర్చునే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. చేతులెత్తి ఓట్లు వేసే విధానంలో మున్సిపల్ పాలకవర్గాన్ని ఎన్నుకోనున్నారు. ఎన్నిక అనంతరం ఛైర్మన్ వైస్ ఛైర్మన్లతో ప్రమాణ శ్రీకారం చేయించనున్నారు. డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో పోలీసులు గట్టి బందోబస్తు చేపడుతున్నారు. మున్సిపల్ గేట్ మూసివేసి కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాను మాత్రమే లోనికి అనుమతించనున్నారు. డీఎస్పీ వెంట స్థానిక సీఐ బొజ్జ మహేష్(CI Bojja Mahesh) ఉన్నారు.