Karimnagar-Tirupati Express train | తిరుపతి ప్రయాణికులకు షాక్​.. జూన్​ నుంచి ఆ రైలు ఉండదు!
Karimnagar-Tirupati Express train | తిరుపతి ప్రయాణికులకు షాక్​.. జూన్​ నుంచి ఆ రైలు ఉండదు!

అక్షరటుడే, హైదరాబాద్: Karimnagar-Tirupati Express train | తిరుపతికి వారానికి రెండుసార్లు నడిచే కరీంనగర్ ​- తిరుపతి ఎక్స్​ప్రెస్​ రైలు వచ్చే నెల(జూన్)​ నుంచి అందుబాటులో ఉండడం లేదా.. బెర్త్‌ రిజర్వేషన్‌ చేసుకునే వారికి ఈ ఎక్స్‌ప్రెస్‌ అధికారిక వెబ్‌సైట్‌లో కనిపించకపోవడంతో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రైల్వే అధికారులకు కూడా దీనిపై స్పష్టమైన సమాచారం లేకపోవడంతో రైలు రద్దవుతుందా.. అనే సందేహం వ్యక్తమవుతోంది.

పెద్దపల్లి స్టేషన్‌లో ఈ నెల 22 తరువాత హాల్టింగ్‌ కూడా ఎత్తివేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. ఐఆర్‌సీటీసీ(IRCTC) సైట్‌లో కూడా ఈ రైలు హాల్టింగ్‌ లిస్టులో పెద్దపల్లి స్టేషన్‌(Peddapalli station)ను కనబడడం లేదు. వచ్చే నెల 1 నుంచి ఐఆర్‌సీటీసీ(IRCTC) వెబ్​సైట్​లో కరీంనగర్‌ స్టేషన్‌ సైతం కనిపించదంటున్నారు.

గత కొన్నేళ్లుగా రాకపోకలు సాగిస్తున్న ఈ కరీంనగర్​ – తిరుపతి రైలు ద్వారా వారానికి సుమారు 2,500 మంది భక్తులు రాకపోకలు సాగిస్తున్నారు. కాగా.. పెద్దపల్లి దగ్గరలో కాజీపేట – బల్లార్షా ప్రధాన రైలు మార్గం నుంచి పెద్దపల్లి – నిజామాబాద్‌ మార్గానికి అనుసంధానం చేసిన బైపాస్‌ మార్గం నిర్మాణంలో సాంకేతిక లోపాలు తలెత్తినట్లు రైల్వేశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ మార్గంలో జరగాల్సిన ట్రయల్‌ రన్‌ ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మార్గం అందుబాటులోకి వస్తే కరీంనగర్‌ నుంచి వరంగల్, కాజీపేట వైపు వెళ్లే రైళ్లు పెద్దపల్లి స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరముండదు. అందుకే కరీంనగర్‌ – తిరుపతి రైలు పెద్దపల్లిలో హాల్టింగ్‌ ఎత్తివేస్తున్నారంటున్నారు.

కరీంనగర్‌ నుంచి నేరుగా తిరుపతికి వెళ్లే రైలు ఇదొక్కటే ఉంది. ఈ తిరుపతి రైలు ద్వారానే గతేడాది కరీంనగర్‌ స్టేషన్‌కు రూ.5,65,22,893 ఆదాయం వచ్చింది. రూ.1,60,714 మంది ప్రయాణించడంతో స్టేషన్‌ స్థాయి ఎన్‌ఎస్‌జీ-5కి ఎగబాకింది. పెద్దపల్లి స్టేషన్‌ ద్వారా సైతం ఏటా ప్రయాణించే 7.73 లక్షల మంది వల్ల రూ.10.69 కోట్లు సమకూరడంతో ఈ స్టేషన్‌ స్థాయి ఎన్‌ఎస్‌జీ-4కి చేరింది.

తిరుపతి ఎక్స్​ప్రెస్​ రైలును నిజామాబాద్‌, బాసర వరకు పొడిగించడం గానీ, వారానికి మరో రెండుసార్లు రాకపోకలు కొనసాగించడం చేస్తే ఈ రెండు స్టేషన్ల ఆదాయం మరింత పెరగనుంది. దీనిపై స్థానిక ఎంపీలు చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.