అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Telangana Govt | రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) తెర లేపారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా కొనసాగుతున్న ఆయన సినీ ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం లేదని చెప్పారు.
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే ఆయన కొంతకాలంగా సినీ పరిశ్రమ గురించి పట్టించుకోవడం లేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills by-election) సమయంలో యూసఫ్‌గూడలో జరిగిన సినీ కార్మిక అభినందన సభలో సైతం పాల్గొనలేదు. సినీ పరిశ్రమకు సంబంధించిన నిర్ణయాలను సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ ఛానెల్లో ఐఏఎస్ అధికారిణి గురించి వచ్చిన కథనాన్ని శనివారం ఆయన ఖండించారు. అనంతరం మాట్లాడుతూ.. తాను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం మానేశానని చెప్పారు.
Telangana Govt | రేట్ల పెంపుతో సంబంధం లేదు
పుష్ప 2 సినిమా విడుదల సమయంలో మహిళ చనిపోతే ఎందుకు పర్మిషన్ ఇచ్చానని బాధపడ్డానని ఆయన చెప్పారు. బాబు ట్రీట్మెంట్కు కూడా తానే డబ్బులు ఇచ్చానని పేర్కొన్నారు. ఆ సినిమా అనంతరం టికెటు రేట్లు పెంచాలని తన వద్దకు రావొద్దని చెప్పానన్నారు. దీంతో తనను ఎవ్వరూ కలవడం లేదని స్పష్టం చేశారు. గతంలో పలు సినిమాల టికెట్ రేట్ల పెంపునకు, తాజాగా రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ గారు సినిమా టికెట్ రేట్ల పెంపునకు తనకు సంబంధం లేదన్నారు. అసలు ఆ ఫైళ్లు తన దగ్గరకు రాలేదని చెప్పారు. దీంతో సంబంధిత శాఖ మంత్రికి తెలియకుండా టికెట్ రేట్లు ఎలా పెంచుతారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Telangana Govt | తీవ్ర చర్చ
సినిమాటోగ్రఫి మంత్రి సినీ పరిశ్రమ గురించి పట్టించుకోవడం లేదని అనడం రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఆయన ఇటీవల అఖండ 2 విడుదల సమయంలో సైతం భవిష్యత్‌లో మూవీ టికెటు రేట్లు పెంచమని తెలిపారు. అయితే ఆయన మాటలను లెక్క చేయకుండా ప్రభుత్వం రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ మూవీల టికెట్ ధరల పెంపునకు అనుమతిచ్చింది. దీంతో సిని పెద్దల ఒత్తిడి మంత్రికి సంబంధం లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
Telangana Govt | మేడారంలో కనిపించని కొండా సురేఖ
రాష్ట్ర ప్రభుత్వం మేడారం మహా జాతరకు వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. త్వరలో జాతర జరగనుండటంతో అభివృద్ధి పనులు దాదాపుగా పూర్తయ్యాయి. అయితే ఆ పనులను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పర్యవేక్షించడం లేదు. జిల్లా మంత్రి సీతక్క, ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అంతా తామై వ్యవహరిస్తున్నారు. గతంలో కొండా మురళి మేడారం పనులపై పలు ఆరోపణలు చేశారు. అనంతరం మంత్రి సురేఖ మేడారం పనుల విషయంలో అంటిముట్టనట్లుగా వ్యవహిస్తున్నారు. జాతర ఆహ్వానాలు అందించడానికి వెళ్తున్న ఆమె పనుల పురోగతిపై మాత్రం పట్టించుకోవడం లేదు. ఆ పనులను మంత్రి పొంగులేటి చూసుకుంటున్నారు.