అక్షరటుడే, వెబ్‌డెస్క్: T20 World Cup | టీ20 ప్రపంచకప్ టోర్నీలో భాగంగా భారత్‌తో ఫిబ్రవరి 15న జరగాల్సిన గ్రూప్ దశ మ్యాచ్‌ను ఆడబోమని పాకిస్థాన్ ఇప్పటికే ప్రకటించగా, తాజాగా ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.
ఇస్లామాబాద్ (Islamabad)లో జరిగిన ఫెడరల్ క్యాబినెట్ సమావేశంలో మాట్లాడిన ఆయన, భారత్‌తో మ్యాచ్ బహిష్కరించే విషయంలో తమ ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుందని తెలిపారు. “క్రీడల్లో రాజకీయాలు ఉండకూడదు, అయినప్పటికీ ఇది సరైన నిర్ణయమే” అంటూ వ్యాఖ్యానించారు. టోర్నీలోని మిగతా మ్యాచ్‌లను మాత్రం ఆడతామని, భారత్‌తో పోటీకి మాత్రం తమ జట్టు మైదానంలోకి దిగదని పాక్ ప్రభుత్వం (Pakistani Government) ముందుగానే సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
T20 World Cup | ఆడేదే లేదు..
ఈ నిర్ణయంపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (International Cricket Council) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎంపికచేసుకుని మ్యాచ్‌లు ఆడటం గ్లోబల్ టోర్నమెంట్ స్ఫూర్తికి విరుద్ధమని, షెడ్యూల్ ప్రకారం అన్ని జట్లు పోటీ పడాల్సిందేనని స్పష్టం చేసింది. ఇది క్రికెట్ సమగ్రత, న్యాయం, పోటీ తత్వాన్ని దెబ్బతీస్తుందని ఐసీసీ పేర్కొంది. జాతీయ విధానాల విషయంలో ప్రభుత్వాల పాత్రను గౌరవించినప్పటికీ, ఈ నిర్ణయం ప్రపంచ క్రికెట్‌కే కాకుండా పాకిస్థాన్ అభిమానులకూ అనుకూలం కాదని వ్యాఖ్యానించింది. పీసీబీ దీర్ఘకాలిక ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది.ఇదిలా ఉండగా భద్రతా కారణాలు చూపుతూ భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్ (Bangladesh) నిరాకరించడంతో టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. షెడ్యూల్ మార్పుకు ఐసీసీ ఒప్పుకోకపోవడంతో ఆ జట్టు వైదొలగగా, ప్రత్యామ్నాయంగా స్కాట్లాండ్ను టోర్నీలోకి తీసుకుంది.
వరల్డ్‌కప్ చరిత్రలో జట్లు మ్యాచ్‌లు ఆడటానికి నిరాకరించడం ఇదే మొదటిసారి కాదు. 1996లో శ్రీలంకలో భద్రతా కారణాల వల్ల ఆస్ట్రేలియా, వెస్ట్ ఇండీస్ జట్లు ఆడేందుకు నిరాకరించగా, 2003లో ఇంగ్లాండ్ జింబాబ్వేతో, న్యూజిలాండ్ కెన్యాలో మ్యాచ్‌లు ఆడలేదు. అప్పుడు ఐసీసీ నిబంధనల ప్రకారం ప్రత్యర్థి జట్లకే పాయింట్లు కేటాయించింది. ఇటీవల అండర్–19 టోర్నీల్లో కూడా ఇలాంటి పరిణామాలపై ఐసీసీ కఠినంగా వ్యవహరించింది.భారత్–పాక్ (India-Pakistan) మ్యాచ్ అంటే ప్రపంచవ్యాప్తంగా భారీ ఆసక్తి ఉండటంతో ప్రసారదారులు, స్పాన్సర్లకు కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. 2012 నుంచి ఈ రెండు జట్లను కావాలనే ఒకే గ్రూప్‌లో ఉంచుతూ ఐసీసీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు పాక్ బహిష్కరణ వల్ల కేవలం పాయింట్లే కాకుండా ప్రపంచ క్రికెట్‌కు భారీ ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. పరుగులు, వికెట్లతో తేలాల్సిన పోరు నిబంధనల పుస్తకాల్లో ముగియబోతుండటం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది