అక్షరటుడే, ధర్పల్లి: MLA Bhupathi Reddy | ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే భూపతి రెడ్డి (MLA Bhupathi Reddy) అన్నారు. మండలంలోని సీతాయ్పేట గ్రామంలో గురువారం నిర్వహించిన ఇందిరమ్మ గృహప్రవేశం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) అమలు చేస్తోందన్నారు. ముఖ్యంగా మహిళల కోసం ఉచిత బస్సు, గృహజ్యోతి, గృహలక్ష్మి వంటి పథకాలను ఇప్పటికే అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.
MLA Bhupathi Reddy | రైతులకు 24 గంటల విద్యుత్..
రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ (free electricity), వరి ధాన్యానికి బోనస్ రైతు భరోసా కల్పిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజాపాలనలో భాగంగానే పేదలకు ఇందిరమ్మ గృహాలు, రేషన్ కార్డులు వడ్డీలేని రుణాలను ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలను విస్మరించిందని ఆయన ఆరోపించారు.
గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలకు ఇళ్లు నిర్మించిన దాఖలాలు లేవని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో నిరుపేదలకు సన్న బియ్యం ఇస్తామని చెప్పి ఒక్క రేషన్ కార్డు (ration cards) కూడా ఇవ్వకపోగా దొడ్డు బియ్యం సరఫరా చేశారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రేషన్ లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తోందని చెప్పారు.
MLA Bhupathi Reddy | అక్రమంగా కట్టిన కాళేశ్వరం కూలింది..
గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాల కారణంగానే కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram project) కుంగిపోయిందని ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. అక్రమ ఆస్తుల పంపకాల్లో తేడాలు రావడం వల్లనే కేసీఆర్ కుటుంబంలో లొల్లి జరుగుతోందని విమర్శించారు. ఎమ్మెల్సీ కవిత కొట్లాట అంతా ప్రజల కోసం కాదని.. ఆస్తిలో తన వాటా కోసమేనని ఆయన ఎద్దేవా చేశారు. బీసీ రిజర్వేషన్ల (BC reservations) విషయంలో కాంగ్రెస్ పార్టీ చేయాల్సిందంతా చేసినప్పటికీ బీజేపీ, బీఆర్ఎస్లు అడ్డుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. అలాంటి పార్టీల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు.
ప్రభుత్వానికి ఇంకా సమయం ఉన్నందున ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాల్రాజ్ మాట్లాడుతూ.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే భూపతిరెడ్డి సహకారంతో గ్రామాల్లో రోడ్లు మౌలిక వసతుల కల్పనకు మరింత కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ చూపడం వల్లే గ్రామానికి 111 ఇందిరమ్మ ఇళ్లు (Indiramma houses) మంజూరయ్యాయని వివరించారు.
లబ్ధిదారులు సాధ్యమైనంత త్వరగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలని కోరారు. అవసరమైతే మరిన్ని ఇళ్లు కూడా మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సింగిల్ విండో ఛైర్మన్ చెలిమెల చిన్నారెడ్డి, మాజీ సర్పంచ్ మిట్టపల్లి గంగారెడ్డి, పుప్పాల సుభాష్, మనోహర్ రెడ్డి, స్థానిక నాయకులు లొక్కిడి రాములు, ఆశన్న, నిశాంత్, బాలయ్య, రాజన్న గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.