అక్షరటుడే, వెబ్‌డెస్క్: Jana Nayagan | తమిళ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ నటించిన జన నాయగన్ సినిమాకు మద్రాస్ హైకోర్టు (Madras High Court)లో ఎదురుదెబ్బ తగిలింది. ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. దీంతో సినిమా విడుదల మరింత ఆలస్యం కానుంది. విజయ్ (Vijay Thalapathy) పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే.
జన నాయగన్ తన చివరి చిత్రం అని ఆయన ప్రకటించారు. ఈ మూవీ జనవరి 9న విడుదల చేస్తామని మొదట చిత్ర బృందం ప్రకటించింది. అయితే సెన్సార్ సర్టిఫికేట్ (Censor Certificate) పొందడంలో ఆలస్యం కారణంగా వాయిదా పడింది. సెన్సార్ పరిశీలన కమిటీ U/A (16+) సర్టిఫికేట్‌ను సిఫార్సు చేసినప్పటికీ, మతపరమైన మనోభావాలను దెబ్బతీసే, సాయుధ దళాలను సమస్యాత్మకంగా చిత్రీకరించే కంటెంట్ గురించి ఫిర్యాదు రావడంతో ఈ చిత్రాన్ని రివైజింగ్ కమిటీకి పంపారు. దీంతో చిత్ర బృందం దీనిపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్ ధర్మాసనం సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయాలని బోర్డును ఆదేశించారు.
Jana Nayagan | డివిజన్ బెంచ్‌లో అప్పీల్
సింగిల్ బెంచ్ తీర్పుపై సన్సార్ బోర్డు (CBFC) డివిజన్ బెంచ్ ఎదుట అప్పీల్ చేసింది. గతంలో సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధించిన ధర్మాసనం.. సెన్సార్ బోర్డు వాదనలు విన్నది. అనంతరం తాజాగా సింగిల్ బెంచ్ ధర్మాసనం ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. మళ్లీ పరిశీలన కోసం ఈ విషయాన్ని తిరిగి సింగిల్ జడ్జికి పంపింది. ఫిర్యాదులోని యోగ్యతలను నిర్ణయించడంలో సింగిల్ జడ్జి పొరపాటు చేశారని బెంచ్ పేర్కొంది. ప్రతివాదనలు సమర్పించడానికి సెన్సార్ బోర్డుకు సింగిల్ జడ్జి సమయం ఇచ్చి ఉండాల్సిందని కూడా హైకోర్టు పేర్కొంది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ప్రదర్శనకు అనుమతిస్తే తప్ప ‘జన నాయగన్’ థియేటర్లలో విడుదల కాదు. ఈ చిత్రానికి ఇంకా బోర్డు నుంచి సెన్సార్ సర్టిఫికేట్ లభించలేదు. దీంతో ఇప్పట్లో సినిమా విడుదలయ్యే అవకాశం లేదు. హెచ్. వినోత్ దర్శకత్వం వహించిన ‘జన నాయగన్’ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజులతో పాటు గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, నరైన్, ప్రియమణి నటిస్తున్నారు.