అక్షరటుడే, వెబ్‌డెస్క్: Uttar Pradesh Labour Incident | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలోని బహ్రైచ్ జిల్లా పరిధిలోని నంద్వాల్ గ్రామం (Nandwal Village)లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన 35 ఏళ్ల నంకై అనే గర్భిణికి గురువారం మధ్యాహ్నం అకస్మాత్తుగా ప్రసవ వేదనలు ప్రారంభమయ్యాయి.
అయితే ఆ నొప్పులు క్రమంగా భరించలేని స్థాయికి చేరుకోవడంతో, ఆ సమయంలో ఆమెతో సహాయం చేయడానికి ఎవరూ లేకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది. తన పరిస్థితిని తట్టుకోలేక ఇంట్లో కూరగాయలు కోసే కత్తిని తీసుకుని, తన కడుపును తానే కోసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఆమె కేకలు విన్న పొరుగువారు వెంటనే అక్కడికి చేరుకుని, రక్తస్రావంతో బాధపడుతున్న ఆమెను సమీపంలోని ఫకర్పూర్ సామాజిక ఆరోగ్య కేంద్రం (Fakharpur Community Health Center)కు తరలించారు.
Uttar Pradesh Labour Incident | నార్మల్ డెలివరీ అయినా పరిస్థితి విషమం
ఆసుపత్రికి చేరిన తర్వాత వైద్యుల పర్యవేక్షణలో ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. నార్మల్ డెలివరీ జరిగినప్పటికీ, ముందుగా కత్తితో కడుపు కోసుకోవడం వల్ల ఆమెకు తీవ్రమైన అంతర్గత గాయాలు అయ్యాయి. ప్రేగులు బయటకు రావడం, భారీగా రక్తస్రావం కావడంతో పరిస్థితి విషమించడంతో వైద్యులు వెంటనే జిల్లా ఆసుపత్రి (District Hospital)కి రిఫర్ చేశారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆమెను లక్నోలోని పెద్ద ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె తల్లి నీతాతో కలిసి అక్కడ చికిత్స పొందుతోంది. శిశువు ఆరోగ్యం స్థిరంగా ఉన్నప్పటికీ, తల్లి పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉందని వైద్యులు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అవుతోంది. అందులో నంకై స్ట్రెచర్‌పై పడుకుని, “నొప్పులు భరించలేకే ఇలా చేసుకున్నాను” అని చెబుతున్నట్లు వినిపిస్తోంది. ఈ వీడియో స్థానికుల్లో కలకలం రేపింది. నంకై భర్త ఆరు నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందినట్లు సమాచారం. అప్పటి నుంచి ఆమె ఒంటరిగానే జీవనం సాగిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. సరైన వైద్య సహాయం, ఆర్థిక సహకారం లేకపోవడం ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణులకు సమయానికి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ సంఘటన మరోసారి గుర్తుచేస్తోంది.