అక్షరటుడే, వెబ్‌డెస్క్ : America attacks | సిరియాపై (Syria) అమెరికా ప్రతీకార దాడులు చేపట్టింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) ఆదేశాలతో ఐసిస్ లక్ష్యాలపై భారీ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది.
సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ (IS) గ్రూప్ లక్ష్యాలపై అమెరికా దళాలు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించాయని అమెరికా సెంట్రల్ కమాండ్ (US Central Command) ప్రకటించింది. డిసెంబర్ 13న సిరియాలో అమెరికా దళాలపై IS జరిపిన ఘోరమైన దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ హాకీ స్ట్రైక్‌లో భాగమైన ఈ దాడులను చేపట్టినట్లు పేర్కొంది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి, ఈ ప్రాంతంలోని అమెరికా, భాగస్వామి దళాలను రక్షించడానికి ఈ దాడులు నిర్వహించినట్లు సెంట్‌కామ్ తెలిపింది.
America attacks | 35 లక్ష్యాలపై..
ఈ ఆపరేషన్‌లో 20 కంటే ఎక్కువ విమానాలు పాల్గొన్నాయి. 35 కంటే ఎక్కువ లక్ష్యాలపై 90 కంటే ఎక్కువ ప్రెసిషన్ మందుగుండు సామగ్రిని ప్రయోగించాయని ఒక అధికారి తెలిపారు. F-15Eలు, A-10, AC-130Jలు, MQ-9లు, జోర్డాన్ F-16లు వంటి విమానాలు ఈ దాడులలో పాల్గొన్నాయి. దాడులు జరిగిన ప్రదేశం, ప్రాణనష్టం ఎంతవరకు జరిగిందనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.
సిరియా (Syria) మధ్యలో ఉన్న పాల్మిరాలో ఒక IS ముష్కరుడు ఇద్దరు US సైనికులను, ఒక US పౌరుడిని చంపాడు. ఈ ఘటన తర్వాత ట్రంప్ పరిపాలన డిసెంబర్‌లో మొదట ఆపరేషన్ హాకీ స్ట్రైక్‌ను ప్రకటించింది. ఇది యుద్ధం కాదని ప్రతీకార ఘటన అని అప్పుడే తెలిపింది. ఈ మేరకు తాజాగా వైమానిక దాడులు చేసింది. ఆ ఆపరేషన్ IS మౌలిక సదుపాయాలు, ఆయుధ ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుంది.