అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Urea Booking | రాష్ట్రవ్యాప్తంగా యాప్ ద్వారానే యూరియా (Urea) విక్రయాలు జరుగుతున్నాయి. ఈ యాప్‌పై అవగాహన లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్రంలోని 10 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా యాప్ ద్వారా యూరియా సరఫరా చేయడాన్ని గతంలోనే అమలు చేశారు. అక్కడ సత్ఫలితాలు ఇవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. దీంతో ఇక నుంచి యాప్ ద్వారా బుక్ చేసుకున్న వారికి మాత్రమే యూరియా లభిస్తుంది. నేరుగా దుకాణానికి వెళ్లి యూరియా కొనుగోలు చేసే అవకాశం లేదు. అయితే ఈ విషయం తెలియక యూరియా లారీ వచ్చిందని తెలియగానే పలువురు రైతులు అక్కడకు వెళ్తున్నారు. తీరా ముందుగా బుక్ చేసుకున్న వారికే ఇస్తామని చెబుతుండటంతో వెనుదిరుగుతున్నారు.
Urea Booking | ఇలా బుక్ చేయాలి
రైతులు యూరియా బుకింగ్ కోసం ‘ఫెర్టిలైజర్’ (Fertilizer) అనే యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ప్లే స్టోర్ నుంచి మాత్రమే దీనిని ఇన్స్టాల్ చేసుకోవాలి. కొందరు ఏపీకే ఫైల్ రూపంలో షేర్ చేస్తున్నారు. ఇదే అదునుగా సైబర్ నేరగాళ్లు సైతం రెచ్చిపోయే అవకాశం లేకపోలేదు. దీంతో ప్లే స్టేర్, ఐవోఎస్ ద్వారా మాత్రమే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. పట్టాపాస్‌బుక్ లింక్ ఉన్న మొబైల్ నంబర్ ద్వారా యాప్‌లోకి లాగిన్ కావాలి. అనంతరం ఆ ఫోన్ నంబర్‌కు లింక్ ఉన్న పట్టాపాస్‌బుక్ వివరాలు యాప్‌లో కనిపిస్తాయి. అందులో కావాల్సిన పట్టాపాస్‌బుక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ పంట (Crop) సాగు చేశామో ఎంటర్ చేయాలి. అనంతరం యూరియా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. బుక్ చేసుకున్న తర్వాత వచ్చిన నంబర్‌ను డీలర్‌కు చూపించి, డబ్బులు ఇస్తే యూరియా బస్తాలు ఇస్తారు.
Urea Booking | అవగాహన లేక..
యూరియా బుకింగ్ యాప్‌పై అవగాహన లేక పలువురు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొంత మంది రైతులు చదువుకొని వారు ఉంటారు. అలాగే చాలా మందికి స్మార్ట్ ఫోన్లు (Smart Phones) లేవు. దీంతో బుకింగ్ ఎలా చేసుకోవాలని ఆందోళన చెందుతున్నారు. ఈ యాప్‌పై వ్యవసాయ అధికారులు ఎలాంటి అవగాహన కల్పించలేదు. యాప్ ద్వారా బుకింగ్ చేసుకుంటునే యూరియా వస్తుందనే విషయాన్ని సైతం ప్రచారం చేయలేదు. దీంతో నిత్యం అన్నదాతలు సొసైటీలు, ఎరువుల దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు. తీరా అక్కడకు వెళ్లాక యాప్ గురించి తెలుస్తోంది.
Urea Booking | బుక్ చేసుకుంటే సులువు
ఒక స్మార్ట్ ఫోన్ నుంచి ఎంత మంది రైతులు అయిన యూరియా బుక్ చేసుకోవచ్చు. వారి పోన్ నంబర్ పట్టాపాస్‌బుక్ (Patta passbook)తో లింక్ అయి ఉండాలి. యాప్‌లో ఫోన్ నంబర్ ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత యూరియా బస్తాలు బుక్ చేసుకోవచ్చు. అనంతరం లాగౌట్ చేసి మరో రైతుకు సంబంధించిన బస్తాలు సైతం బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఇలా ఒక ఫోన్ ద్వారా ఎంత మంది రైతులు అయిన చేసుకోవచ్చు. అయితే ఫోన్ నంబర్‌కు వచ్చే ఓటీపీ చెప్పాల్సి ఉంటుంది. ఈ విధానం బాగానే ఉంది. ఉదయం నుంచి సొసైటీ (PACS)ల లైన్లో ఉండాల్సిన అవసరం లేదు. ఫోన్లో లాగిన్ అయి ఎక్కడ యూరియా ఉందో చెక్ చేసుకోవచ్చు. స్టాక్ ఉంటే జిల్లాలో ఎక్కడైన బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఈ విధానంతో ఎకరాకు కొన్ని బస్తాలు మాత్రమే ఇస్తున్నారు. ఫలితంగా ఎక్కువగా తీసుకుపోయి.. కొరతకు కారణమయ్యే అవకాశం లేదు. అలాగే డీలర్లు సైతం అక్రమంగా అమ్ముకునే అవకాశం లేకుండా పోయింది. అయితే దీనిపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తే రైతులకు మేలు జరుగుతుంది.