UPI Payments
UPI Payments | రెండేళ్ల‌లో రెట్టింపు.. రోజుకు 700 మిలియ‌న్ల యూపీఐ లావాదేవీలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : UPI Payments | యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) లావాదేవీలు నిత్య జీవ‌నంలో భాగమై పోయాయి. యూపీఐ రాక‌తో న‌గ‌దు చెల్లింపుల‌తో ప‌ని అవ‌స‌రం లేకుండా పోయింది. కేవ‌లం ఫోన్, అకౌంట్‌లో క్యాష్ ఉంటే చాలు జేబుల్లో డ‌బ్బులు లేకున్నా ఫ‌ర్వాలేద‌న్న ధీమా పెరిగింది. జ‌న జీవ‌నంతో పెన‌వేసుకుపోయిన యూపీఐ లావాదేవీలు(UPI Transactions) భారీగా పెరిగాయి. రెండేళ్ల‌లో రెట్టింప‌య్యాయి. ఆగస్టు 2న రోజువారీ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ లావాదేవీలు తొలిసారి 700 మిలియన్లను దాటాయి.

UPI Payments | పెరిగిన లావాదేవీలు..

యూపీఐ సేవ‌లు(UPI Services) అందుబాటులోకి రావ‌డంతో ప్ర‌జ‌ల‌కు ఎన్నో పాట్లు త‌ప్పాయి. న‌గ‌దు కోసం బ్యాంకుల వ‌ద్ద నిరీక్షించ‌డం, చేతిలో, ఇంట్లో డ‌బ్బులు దాచుకోవ‌డంలో అభ‌ద్ర‌త వంటి స‌మ‌స్య‌లు దూర‌మ‌య్యాయి. యూపీఐ సేవ‌ల రాక‌తో లావాదేవీలు సులువ‌గా మారాయి. టీ, కాఫీ వంటి వాటి నుంచి మొద‌లు స్కూల్ ఫీజులు, ప‌న్నుల వ‌ర‌కు అన్ని చెల్లింపులకు యూపీఐ కీల‌కంగా మారింది. ఈ నేప‌థ్యంలోనే దేశ‌వ్యాప్తంగా వీటి లావాదేవీలు భారీగా పెరిగాయి.

UPI Payments | ల‌క్ష్యానికి చేరువ‌లో..

యూపీఐ సేవ‌ల‌ను ప్రారంభించిన స‌మ‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం(Central Government) నిర్దేశిత ల‌క్ష్యానికి చేరువ‌వుతోంది. రోజుకు క‌నీసం వంద కోట్ల లావాదేవీలు జ‌రుగాల‌ని కేంద్రం ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. ప్ర‌స్తుత వృద్ధి రేటు చూస్తే త్వ‌ర‌లోనే ఆ లక్ష్యాన్ని అధిగ‌మించే అవ‌కాశం క‌నిపిస్తోంది. గ‌త రెండేళ్ల‌లో రోజువారీ లావాదేవీల సంఖ్య రెట్టింపు అయింది. 2023 ఆగస్టులో రోజుకు స‌గ‌టున దాదాపు 350 మిలియన్ల యూపీఐ లావాదేవీలు నమోదు కాగా, గతేడాది దాదాపు 500 మిలియ‌న్ల‌ను దాటింది. ఇప్పుడ‌ది 700 మిలియ‌న్ల‌కు చేరింది. రానున్న రోజుల్లో సులువుగా నిత్యం కోటి లావాదేవీలు జ‌రుగుతాయ‌ని భావిస్తున్నారు.

UPI Payments | రోజుకు 83 వేల కోట్ల చెల్లింపులు..

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నిర్వహిస్తున్న మొబైల్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్(Mobile Payments Platform) దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫామ్, దాదాపు 85 శాతం లావాదేవీలు దీని ద్వారానే జరుగుతున్నాయి. యూపీఐ లావాదేవీల ద్వారా నిత్యం వేల కోట్ల‌ల్లో చెల్లింపులు కొన‌సాగుతున్నాయి. గత నెలలో, UPI రూ. 25 లక్షల కోట్లకు పైగా విలువైన 19.5 బిలియన్ లావాదేవీలను నమోదు చేసింది. అంటే సగటున ఒక రోజులో దాదాపు 650 మిలియన్ లావాదేవీలు రోజుకు దాదాపు రూ. 83,000 కోట్ల విలువైన చెల్లింపులు జ‌రిగాయ‌న్న మాట‌.

UPI Payments | అత్యంత వేగంగా వృద్ధి..

ఇంటర్నెట్ వ్యాప్తి మెరుగుపడటంతో పాటు వ్యాపారులు డిజిటల్ చెల్లింపులను స్వీకరించడంతో యూపీఐ చెల్లింపుల్లో నెలవారీగా 5-7 శాతం వృద్ధి న‌మోద‌వుతోంది. యూపీఐ రోజువారీ లావాదేవీలు ప్ర‌పంచంలోనే అత్యంత‌గ వేగంగా వృద్ధి చెందుతున్నాయి. ప్ర‌పంచంలో అత్య‌ధికంగా లావాదేవీలు జ‌రుపుతున్న సంస్థ‌గా “వీసా“కు మొద‌టి స్థానంలో ఉంది. రానున్న రోజుల్లో ఆ సంస్థ‌ను అధిగ‌మించ‌నున్న‌ యూపీఐ ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్ ఇంటర్‌బ్యాంక్ చెల్లింపు సెటిల్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌గా మారుతుంది.