అక్షరటుడే, వెబ్‌డెస్క్: Chhattisgarh Encounter | మావోయిస్ట్‌లకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లో శనివారం ఉదయం చోటు చేసుకున్న ఎన్కౌంటర్లో ఇద్దరు నక్సల్స్ చనిపోయారు.
ఛత్తీస్‌గఢ్‌లోని దక్షిణ బస్తర్ ప్రాంతంలో డీఆర్జీ బలగాలు కూంబింగ్ (Coombing) చేపట్టాయి. అక్కడ మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు సెర్చ్ ఆపరేషన్ (Search Operation) చేపట్టగా.. శనివారం తెల్లవారుజామున కాల్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం 10 గంటల వరకు కూడా కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడ 10 నుంచి 15 మంది మావోయిస్టులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎన్కౌంటర్లో ఇద్దరు చనిపోయారని చెప్పారు. వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. భద్రతా దళాలు మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
Chhattisgarh Encounter | బలగాల విజయం
దేశంలో 2026 మార్చి 31 వరకు మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర ప్రభుత్వం (Central Government) ప్రకటించింది. ఈ మేరకు ఆపరేషన్ కగార్ (Operation Kagar) చేపట్టింది. వేల సంఖ్యలో బలగాలు అడువులను నిత్యం జల్లెడ పడుతున్నాయి. ఆధునిక సాంకేతికత, పక్కా సమాచారం మేరకు సెర్చ్ ఆపరేషన్లు చేపడతున్నాయి. మావోయిస్టుల ఏరివేతలో బలగాలు భారీ విజయం సాధించాయి. ఇప్పటికే అనేక మంది కీలక నేతలు ఎన్కౌంటర్లలో చనిపోయారు. పార్టీ కార్యదర్శి నంబాల కేశవరావు మృతితో ఉద్యమం బలహీనంగా అయింది. మరోవైపు ఇటీవల పోలిట్ బ్యూరో సభ్యుడు, కీలక నేత హిడ్మా (Hidma) ఎన్‌కౌంటర్‌తో మావోలు చాలా మంది ఉద్యమ బాట వీడటానికి సిద్ధం అయ్యారు.
Chhattisgarh Encounter | ప్రభుత్వాల ప్రోత్సాహం
ఓ వైపు బలగాలు అడవుల్లోకి చొచ్చుకువస్తుండటం, మరోవైపు కీలక నేతలు హతం అవుతుండటంటో మావోయిస్టులు లొంగుబాట పట్టారు. ఇప్పటికే పార్టీ అగ్రనేతల మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న తమ అనుచరులతో లొంగిపోయారు. వీరే కాకుండా అనేక మంది మావోయిస్టులు సరెండర్ (Maoists Surrender)అయ్యారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లొంగుబాట్లను ప్రోత్సహిస్తున్నాయి. లొంగిపోయిన వారి భద్రతకు భరోసా ఇస్తున్నాయి. దీంతో మావోలు అడవులను వీడుతున్నారు. మాడ్వి హిడ్మా సన్నిహితుడు, పీఎల్జీఏ కమాండర్ బర్సా దేవా సైతం తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ విషయాన్ని ఈ రోజు డీజీపీ అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.