అక్షరటుడే, వెబ్‌డెస్క్: Chhattisgarh Encounter | మావోయిస్టులకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 12 మంది నక్సల్స్ మృతి చెందారు.
సుక్మా జిల్లా (Sukma District)లో భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు మరణించారు. కిష్టారం పోలీస్ స్టేషన్ (Kishtaram Police Station) పరిధిలోని పలోడి, పోటక్పల్లి ప్రాంతాల నుంచి సుక్మా జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG) శుక్రవారం సాయంత్రం ఈ ఆపరేషన్‌ను ప్రారంభించింది. సుక్మాలోని కిష్టారం ప్రాంతంలోని పమ్లూర్ గ్రామం సమీపంలో శనివారం ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. మరణించిన వారిలో కొంటా ఏరియా కమిటీ కార్యదర్శి మంగ్డు కూడా ఉన్నాడు. ఈ ఎన్కౌంటర్లో కొంటా ఏరియా కమిటీ పూర్తిగా హతం అయినట్లు సమాచారం.
Chhattisgarh Encounter | పక్కా సమాచారం మేరకు..
దక్షిణ బస్తర్ ప్రాంతంలో మావోయిస్టులు (Maoists) ఉన్నారనే సమాచారం మేరకు సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ ఆధ్వర్యంలో ఆపరేషన్ చేపట్టారు. శనివారం ఉదయం సుమారు 5.30 గంటల ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఘటన స్థలం నుంచి ఇప్పటి వరకు 12 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే మూడు AK-47, INSAS రైఫిల్స్, SLR రైఫిల్స్‌తో పాటు భారీగా ఆయుధాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
బీజాపూర్ జిల్లా (Bijapur District)లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్ట్‌లు చనిపోయారు. శనివారం తెల్లవారుజామున కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎన్కౌంటర్లో ఇద్దరు చనిపోయారని పోలీసులు చెప్పారు. వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఒకే రోజు 14 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోవడం గమనార్హం.