అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Trump Immigration Court Victory | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు (Donald Trump) అప్పీల్స్ కోర్టులో భారీ ఊరట దక్కింది. బాండ్ హియరింగ్‌కు అనుమతి ఇవ్వకుండానే వలసదారులను నిర్బంధించే విషయంలో ట్రంప్ ప్రభుత్వ విధానాన్ని అప్పీల్స్ కోర్టు సమర్థించింది. ఈ మేరకు ధర్మాసనం 2-1 మెజారిటీతో తీర్పు ఇచ్చింది.
Trump Immigration Court Victory | కోర్టును ఆశ్రయించిన పలువురు
అమెరికాలో ఇటీవలి కాలంలో వలసదారులను అరెస్టు చేసినప్పుడు హోంలాండ్ భద్రతాధికారులు బాండ్ హియరింగ్‌ను నిరాకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వలసదారుల నిర్భందాలపై పలువురు కోర్టును ఆశ్రయించారు. ఇలాంటి నిర్బంధాలను దిగువ కోర్టులు తప్పుబడుతున్నాయి. కానీ ఇది రాజ్యాంగం, ఫెడరల్ వలస చట్టాలకు అనుగుణంగానే ఉందని ఐదో సర్క్యూట్ కోర్టు ధర్మాసనం శుక్రవారం సాయంత్రం తీర్పు ఇచ్చింది. ట్రంప్ ప్రభుత్వ (Trump Administration) విధానాన్ని సమర్థిస్తూ ధర్మాసనం తరఫున 2-1 మెజారిటీతో జడ్జి ఎడిత్ హెచ్ జోన్స్ తీర్పు రాశారు. ఇది రాజ్యాంగం, ఫెడరల్ వలస చట్టాలకు అనుగుణంగానే ఉందని, వలస, జాతీయ చట్టాలకు ప్రభుత్వం సరిగానే అర్థం చెప్పిందని అభిప్రాయపడ్డారు. అనుమతిలేని విదేశీయులు దేశంలో ఎక్కడ పట్టుబడినా బాండ్‌పై విడుదలకు అనర్హులని స్పష్టం చేశారు. వారు ఎంతకాలం దేశంలో ఉన్నారన్నదీ అప్రస్తుతమని తీర్పులో పేర్కొన్నారు.
గతంలో సరిహద్దుల్లో అరెస్టయితే..
గతంలో విదేశీయులు సరిహద్దుల్లో అరెస్టయితే.. వారికి ఎటువంటి నేర చరిత్రా లేకపోతే వలసదారుల కోర్టులో బాండ్ హియరింగ్‌ను కోరేవారు. కోర్టులూ వారికి బాండ్లను మంజూరు చేసేవి. మెక్సికోకు చెందిన ఇద్దరు వలసదారులు అమెరికాలో పదేళ్లుగా ఉంటున్నారు. గతేడాది వారు తమను చాలాకాలం నిర్బంధించడాన్ని సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్లు వేశారు. వారికి గత అక్టోబరులో టెక్సాస్ కోర్టు బాండ్లు మంజూరు చేసింది. గత జూలైలో ట్రంప్ యంత్రాంగం బాండ్ల విధానాన్ని తిరగదోడింది. తాజాగా అప్పీల్స్ కోర్టు (Appeals Court ) ఆ విధానాన్ని సమర్థించింది. ఇలాంటి నిర్బంధాలను ఇటీవల దిగువ కోర్టులు తప్పుబడుతున్న నేపథ్యంలో అప్పీల్స్ కోర్టు ఇచ్చిన తీర్పు ట్రంప్‌నకు భారీ న్యాయ విజయంగా భావిస్తున్నారు.