అక్షరటుడే, వెబ్డెస్క్ : India US Interim Trade Deal | సుదీర్ఘ చర్చల తర్వాత భారత్ -అమెరికాల మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరింది. దీనిపై ఇరు దేశాలు వచ్చేనెలలో సంతకాలు చేయనున్నాయి. ఆ తర్వాత పలు ఉత్పత్తులపై అమెరికా (America) తన సుంకాలను 18 శాతానికి తగ్గించనుంది.
భారత్ కొన్నింటిపై సుంకాలను సున్నా చేయనుంది. అయితే భారత్ రైతులకు ఎలాంటి నష్టం లేకుండా.. కొన్ని వస్తువులపై మాత్రమే సుంకాలను ఈ ఒప్పందంలో భాగంగా తగ్గించారు. మధ్యంతర వాణిజ్య ఒప్పందం (Trade Agreement) కుదిరిన నేపథ్యంలో అమెరికా నుంచి భారత్‌లోకి దిగుమతి అయ్యే ఆహార పదార్థాల ధరలు తగ్గుతాయని భావిస్తున్నారు.
ధరలు తగ్గే ఆహార ఉత్పత్తుల వివరాలు తెలుసుందామా..
బాదం, పిస్తా, వాల్‌నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ ధరలు తగ్గనున్నాయి.
తాజా పండ్లతోపాటు ప్రాసెస్ చేసిన పండ్లపై దిగుమతి సుంకాలు తగ్గనున్నాయి. అయితే భారతదేశ రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు వీటిపై కనీస దిగుమతి ధర నిబంధన మాత్రం కొనసాగునుంది.
సోయాబీన్ ఆయిల్ (Soybean Oil)పై సుంకాలు తగ్గనున్నందున ధరలు దిగివచ్చే అవకాశాలున్నాయి.
పశువులు, కోళ్ల మేతలో వాడే ప్రొటీన్ పదార్థాలు, ఎర్ర జొన్నలపై దిగుమతి సుంకాలు తగ్గుతాయి. దీనివల్ల దాణా తయారీ ఖర్చు తగ్గి, పరోక్షంగా దానిపై ఆధారపడే పలు రంగాలకు లబ్ధి చేకూరనుంది.
కనీస దిగుమతి ధర కొనసాగుతున్నప్పటికీ అమెరికన్ వైన్‌తోపాటు ఇతర స్పిరిట్‌ల ధరలు కూడా తగ్గనున్నాయి.
కొన్నింటిపై పాత సుంకాలే..
భారతదేశం తన రైతుల ప్రయోజనాలను కాపాడుకునేందుకు కొన్నింటిపై సుంకాల తగ్గింపునకు మన ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో పలు ఉత్పత్తులపై పాత సుంకాలే కొనసాగనున్నాయి.
గోధుమలు, వరి, మక్క, జొన్న, సజ్జ, రాగి, కొర్రలు, బార్లీ, ఓట్స్ వంటి ఉత్పత్తులపై పాత సుంకాలే అమలు కానున్నాయి.
పాలు, వెన్న, నెయ్యి, పెరుగు ఉత్పత్తులు, చికెన్, ఇతర మాంసాలు, బంగాళాదుంపలు, బఠానీలు, చిక్కుళ్లు, పుట్టగొడుగులు వంటివి కూడా మధ్యంతర వాణిజ్య ఒప్పందం పరిధిలో లేవు.
