అక్షరటుడే, వెబ్‌డెస్క్ : YS Jagan | ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. మంగళవారం పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా పలు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఉప ఎన్నికపై ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత బుధవారం మీడియాతో మాట్లాడారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) రాజ్యాంగాన్ని అవమానించారన్నారు. బందిపోటు దొంగల తరహాలో ఎన్నిక జరిపించాన్నారు. చంద్రబాబుకు ఇది ఆఖరి ఎన్నికలు కావొచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా కృష్ణా రామా అనుకుంటే పుణ్యమైన వస్తుందని, లేదంటే నరకానికి పోతారని హెచ్చరించారు.
YS Jagan | పోలింగ్ బూత్‌లను మార్చారు
అధికారంలో ఉన్న పార్టీ ఈ విధంగా ఎన్నికలు నిర్వహిస్తే హాస్యాస్పదమే అవుతుందని జగన్ (YS Jagan) విమర్శించారు. ఇక ఎన్నికలు జరపాల్సిన పనిలేదని, ఇష్టమొచ్చినట్లు ఓట్లు వేసుకొచ్చన్నారు. పులివెందుల ZPTC ఉప ఎన్నిక కోసం చంద్రబాబు కుట్రలకు పాల్పడ్డారని ఆరోపించారు. పోలింగ్ బూత్‌లను మార్చేశారని మండిపడ్డారు. వైసీపీ ఏజెంట్లు లేకుండానే ఎన్నికలు నిర్వహించారన్నారు. బూత్‌లలో తమ ఏజెంట్లను కూర్చొకుండా చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇంత అన్యాయంగా ఎన్నికలు ఎప్పుడూ జరగలేదన్నారు.
YS Jagan | బయటి వాళ్లు ఓట్లేశారు
జెడ్పీటీసీ ఎన్నికల్లో (ZPTC Elections) బయటివారు ఓటు వేశారని జగన్ ఆరోపించారు. పోలింగ్ బూత్‌ల దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజీలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఆరు పంచాయతీల్లో 700 మంది పోలీసులను పెట్టి ప్రజలను భయపెట్టారన్నారు. ఒక్కో బూత్‌లో 500 మంది వరకు బయటివాళ్లు ఓట్లు వేశారని ఆయన ఆరోపించారు. బీటెక్ రవి అనే వ్యక్తి పులివెందుల ఓటరు కాకపోయినా అక్కడే తిష్టవేశారన్నారు.
YS Jagan | రాహుల్ గాంధీపై విమర్శలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై సైతం జగన్ విమర్శలు చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతున్న రాహుల్ గాంధీ (Rahul Gandhi), కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం లేదని విమర్శలు చేశారు. ఓటు చోరీ గురించి మాట్లాడుతున్న రాహుల్ గాంధీ ఆంధ్రలో జరిగిన ఓట్ల చోరీపై మాట్లాడటం లేదన్నారు. దీనికి కారణం రాహుల్‌గాంధీ, చంద్రబాబు నాయుడు, రేవంత్‌రెడ్డి హాట్‌లైన్ టచ్‌లో ఉండడమేనని విమర్శించారు.
