అక్షరటుడే ఆర్మూర్ : Jenda Balaji Festival | తిరుమల వెళ్లలేని భక్తులకు తమ మొక్కలను.. కానుకలను.. ముడుపులను వెంకన్నకు చేరేలా 200ఏళ్ల క్రితం ఆర్మూర్‌లో జెండా జాతర ప్రారంభించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆర్మూర్ జెండా జాతరకు (Armoor Jenda jathara) జిల్లాలో ప్రత్యేక స్థానం ఉంది. స్థానికంగా జెండా ఉత్సవాలను (flag festivals) సర్వసమాజ్ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించారు. నేడు జెండా జాతర నేపథ్యంలో ప్రత్యేక కథనం..
పట్టణంలోని జెండాగల్లీలో పురాతన వెంకటేశ్వర ఆలయం (Venkateswara temple) ఉంది. అక్కడే ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతంలో జెండా నెలకొల్పి పూజలు చేస్తున్న కారణంగా కాలనీకి జెండాగల్లీ అని పేరు స్థిరపడిపోయింది. శ్రావణశుద్ద విదియ నుంచి ఏకాదశి మంగళవారం వరకు తొమ్మిది రోజులపాటు జెండా ఉత్సవాలను సర్వసమాజ్ కమిటీ (Sarva Samaj Committee) ఆధ్వర్యంలో జరిపించారు. పట్టణానికి చెందిన చేనేతకారులు నేసిన వస్త్రాన్ని జెండాకు చూడతారు. పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి జెండా బాలాజీ ఆలయంలోని స్తంభానికి జెండాను ప్రతిష్ఠిస్తారు.
ప్రతినిత్యం జెండాకు ప్రత్యేక పూజలు నిర్వహించి చివరి రోజు ఏకాదశి పెద్దఎత్తున జాతరను నిర్వహిస్తారు. ఈ జాతరకు ఆర్మూర్‌తో (Armoor) పాటు ఆదిలాబాద్, నిర్మల్, మెట్పల్లి, నిజామాబాద్ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. జాతర అనంతరం డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకెళ్లి అంకాపూర్ గ్రామ (Ankapur village) శివారులో అంకాపూర్ గ్రామస్థులకు జెండాను అప్పజెబుతారు. దీంతో జెండా జాతర ముగుస్తుంది.
Jenda Balaji Festival | స్థల పురాణం..
హైదరాబాద్‌ను నిజాం పరిపాలించే సమయంలో ఆర్మూర్ ప్రాంతం అంకాపూర్ వెంకట భూపతి సంస్థానం (Ankapur Venkata Bhupathi Sansthan) ఆధీనంలో ఉండేది. ఆ సమయంలో ఆర్థిక స్థోమత లేక తిరుమల వెళ్లలేని భక్తుల కోసం సుమారు 200 ఏళ్ల క్రితం జెండాగల్లీలో జెండాను ప్రతిష్ఠించారు. ఆర్మూర్‌లో జెండాను ఏర్పాటు చేసి తొమ్మిది రోజులు పూజలు నిర్వహించిన తర్వాత అంకాపూర్ గ్రామానికి చేరుకుంటుంది.
Jenda Balaji Festival | చివరికి వెంకన్న సన్నిధికి..
అంకాపూర్ గ్రామంలోని గడిలో జెండాను ప్రతిష్ఠించి పూజలు జరుపుతారు. అటు తర్వాత జక్రాన్‌పల్లి మండలం (Jakranpalli mandal) అర్గుల్ గ్రామంలోని గడిలో జెండాను ప్రతిష్ఠిస్తారు. పూజల అనంతరం అక్కడి నుంచి సిర్నాపల్లి గ్రామంలోని గడికి జెండా చేరుకుంటుంది. అక్కడ పూజలు నిర్వహించి జెండాతో పంపిన కర్రను తిరిగి ఆర్మూర్‌కు పంపించేస్తారు. జెండాకు ఉన్న వస్త్రాన్ని మాత్రం దసరాకు ఒకరోజు ముందు తిరుమల వేంకటేశ్వర ఆలయానికి చేరుస్తారు. అక్కడ జెండా వస్త్రాన్ని వత్తిగా మలిచి స్వామి వారి ముందు జ్యోతిగా వెలిగిస్తారు. ప్రజల ముడుపులు ఆ ఆవిధంగా స్వామికి చేరుతాయి.
Jenda Balaji Festival | కోరిన కోరికలు నెరవేరుతాయి..
– మద్దికుంట శ్రావణ్, ఆర్మూర్
ఆర్మూర్‌లోని జెండా బాలాజీ ఆలయం ఎంతో మహిమ కలది. కోరిన కోరికలు తీర్చే దైవం. ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా తప్పక నెరవేరుతాయి. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది సైతం జెండాను ప్రతిష్ఠించారు. ఆలయంలో పూజలు చేసి జెండా వద్ద మొక్కులు చెల్లించుకున్నాం.