అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy GGH | కుక్కకాటు ఘటనలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత నెల 25న కుక్కకాటుకు గురైన రెండున్నరేళ్ల చిన్నారి మూడో డోస్ ఇంజక్షన్ తీసుకోగానే అపస్మారక స్థితిలోకి వెళ్లి మృత్యువాత పడింది. ఈ ఘటన కామారెడ్డి జీజీహెచ్‌లో ఆదివారం చోటుచేసుకుంది.
Kamareddy GGH | కొటాట్ పల్లికి చెందిన చిన్నారి
బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కామారెడ్డి మండలం కొటాల్ పల్లి గ్రామానికి (Kotal Palli Village) చెందిన అర్చన రమేష్ దంపతులు కామారెడ్డి పట్టణంలోని అయ్యప్ప నగర్ కాలనీలో (Ayyappa Nagar Colony) నివాసం ఉంటున్నారు. వీరికి ఒక బాబు, పాప ఉన్నారు. గత నెల 25న ఇంటిముందు ఆడుకుంటుండగా రెండున్నరేళ్ల చిన్నారి క్రితిక్ సారను కుక్క కరిచింది. వెంటనే జీజీహెచ్‌కు తీసుకురాగా కుక్కకాటు నివారణ ఇంజక్షన్ చేశారు. ఆదివారం మూడో డోస్ తీసుకోవడానికి చిన్నారిని తీసుకుని తల్లిదండ్రులు జీజీహెచ్‌కు వచ్చారు.
Kamareddy GGH | మూడో డోస్ ఇవ్వగానే..
అయితే మూడో డోస్ తీసుకోగానే చిన్నారి అపస్మారక స్థితికి చేరుకోవడంతో వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి (Private Hospital) తీసుకెళ్లగా పల్స్ పడిపోయిందని, చలనం లేదని చెప్పడంతో తిరిగి జీజీహెచ్‌కు తీసుకువచ్చారు. చిన్నారి మృతి చెందడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు, బంధువులు పెద్దఎత్తున ఆస్పత్రికి చేరుకుని ఆస్పత్రి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అద్దాలను పగులగొట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు. బాధితులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వినిపించుకోకుండా దాదాపు రెండున్నర గంటలుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఆందోళన నేపథ్యంలో ఆస్పత్రికి వచ్చిన ఇతర రోగులు పరిస్థితుల్ని చూసి ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తున్నారు. ప్రస్తుతం ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.