అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Medigadda barrage | కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీకి (Medigadda barrage) కేంద్ర ప్రభుత్వం రెడ్ అలెర్ట్ జారీ చేసింది. కేటగిరి-1 ప్రమాదకర డ్యామ్‌గా గుర్తించింది. తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించింది.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో (Kaleshwaram project) భాగంగా బీఆర్ఎస్ హయాంలో మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించిన విషయం తెలిసిందే. ఈ బ్యారేజీ 2023లోనే కుంగిపోయింది. కొన్ని పిల్లర్లకు పగుళ్లు వచ్చాయి. గతేడాది వర్షాకాలంలో తనిఖీల్లో భాగంగా కేంద్ర అధికారులు మేడిగడ్డను పరిశీలించారు. ప్రాజెక్టు లోపాలు గుర్తించారు. లోపాలు పర్కిష్కరించకపోతే ప్రమాదమని హెచ్చరించారు. ప్రాజెక్ట్ భద్రతపై తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికను తాజాగా కేంద్రం లోక్‌సభలో విడుదల చేసింది.
Medigadda barrage | ఖజానాకు నష్టం
కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో రాష్ట్ర ఖజానాకు భారీగా నష్టం వాటిల్లినట్లు గతంలో పీసీ ఘోష్ కమిషన్ (PC Ghosh Commission) నివేదిక తెలిపింది. 2023 అక్టోబరు 21న మేడిగడ్డ ఏడో బ్లాకు కుంగిపోయింది. అయితే ఇప్పటి వరకు దానికి మరమ్మతులు చేపట్టలేదు. దీంతో ప్రాజెక్ట్ భద్రతపై ఆందోళన నెలకొంది. భారీ వ్యయంతో నిర్మించిన ప్రాజెక్ట్ ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. దాంట్లో నీటి నిల్వకు అవకాశం లేకుండా పోయింది. అయితే కేంద్రం సూచనల మేరకు బ్యారేజీ మరమ్మతులు చేపడుతారా లేదా చూడాలి.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. కాళేశ్వరంలో అక్రమాలను తేల్చడానికి పీసీ ఘోష్ కమిషన్‌ను వేసింది. సుదీర్ఘ కాలం విచారణ జరిపిన కమిషన్ గతేడాది జులై 31న నివేదిక సమర్పించింది. నిబంధనలు పాటించకపోవడం, ఇష్టారాజ్యంగా పనులు చేపట్టడంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగినట్లు కమిషన్ తెలిపింది. అయితే ప్రభుత్వం ఈ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. సీబీఐ విచారణ జరిపించాలని కోరింది. ప్రస్తుతం కాళేశ్వరం విచారణ సీబీఐ పరిధిలో ఉంది.