అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Thailand School Shooting | థాయిలాండ్ (Thailand)లో కాల్పులు కలకలం రేపాయి. దుండగుడు పాఠశాలలోకి చొరబడి కాల్పులు జరిపాడు.
దక్షిణ థాయిలాండ్‌లోని ఒక పాఠశాలలోకి బుధవారం దుండగుడు చొరబడ్డాడు. విద్యార్థులను బందీలుగా చేసుకున్నాడు. అనంతరం కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. 18 ఏళ్ల యువకుడు కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. పాఠశాలపై అనేకసార్లు కాల్పులు జరిపాడని, అనేక మంది ఉపాధ్యాయులు, విద్యార్థులను బందీలుగా తీసుకున్నాడని పోలీసులు తెలిపారు.
Thailand School Shooting | నిందితుడిపై కాల్పులు
పాఠశాలలో కాల్పులు జరిపిన వ్యక్తి థాయ్ పోలీసులు కాల్పులు జరిపారని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. నిందితుడిని పోలీసులు కాల్చి చంపారని థాయిలాండ్ మీడియా తెలిపింది. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులను విడిపించారు. నిందితుడి కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. నిందితుడు పాఠశాలలోకి ప్రవేశించిన కొద్దిసేపటికే, రెండు నుంచి మూడు సార్లు కాల్పుల శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలిపారు. నేషన్ థాయిలాండ్ నివేదిక ప్రకారం, నిందితుడు సాయంత్రం 4.59 గంటలకు పాఠశాలలోకి ప్రవేశించాడు. పోలీసులు పాఠశాల భవనంలోకి ప్రవేశించి ఆపరేషన్ నిర్వహించారు.
కాగా థాయిలాండ్‌లో గతంలో సైతం పాఠశాలల్లో కాల్పులు చోటు చేసుకున్నాయి. 2022లో ఒక నర్సరీ స్కూల్లో ఒక మాజీ పోలీసు అధికారి తుపాకీ, కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో 22 మంది పిల్లలు సహా 36 మందిని చనిపోయారు. తాజా ఘటనలో ఎంతమంది గాయపడ్డారనే వివరాలను అధికారులు ప్రకటించలేదు.